జోహన్నెస్‌బర్గ్ వేదికగా గురువారం దక్షిణాఫ్రికాతో మూడో టీ20లో తలపడేందుకు టీమిండియా సిద్దమైంది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి సిరీస్‌ను 1-1తో సమం చేయాలని భారత జట్టు భావిస్తోంది. మరోవైపు సౌతాఫ్రికా ఆఖరి టీ20లో భారత్‌ను ఓడించి 2-0తో సిరీస్‌ను సొంతం చేసుకోవాలని వ్యూహాలు రచిస్తోంది. ఇక ఈ కీలక మ్యాచ్‌లో టీమిండియా పలు మార్పులతో బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది.
ఈ మ్యాచ్ కోసం భారత తుది జట్టులోకి యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్‌తో పాటు మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్, టీ20 నెం1 బౌలర్ రవి బిష్ణోయ్ రానున్నట్లు సమాచారం.ఈ క్రమంలో మరో యువ ఓపెనర్ యశస్వీ జైశ్వాల్, తిలక్ వర్మ, స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ బెంచ్‌కు పరిమితం చేయాలని జట్టు మేనెజ్మెంట్ నిర్ణయించినట్లు తెలుస్తోంది.
కాగా రెండో టీ20లో జైశ్వాల్‌తో పాటు శుబ్‌మన్ గిల్ తీవ్ర నిరాశపరిచారు. ఈ ఇద్దరూ ఓపెనర్లు కూడా ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరారు. అయితే టీ20ల్లో గిల్‌కు మంచి రికార్డు దృష్ట్యా అతడిని మూడో టీ20లో కొనసాగించే ఛాన్స్ ఉంది. ఈ మ్యాచ్‌లో భారత ఇన్నింగ్స్‌ను గిల్‌తో కలిసి రుతురాజ్ ప్రారంభించే అవకాశం ఉంది.
అదే విధంగా రెండో టీ20లో హైదరాబాదీ తిలక్ వర్మ అకట్టుకున్నప్పటికీ.. కీలక మ్యాచ్ నేపథ్యంలో శ్రేయస్ అయ్యర్ వైపే మేనెజ్మెంట్ మొగ్గు చూపిస్తోంది. మరోవైపు పేస్ బౌలింగ్ విభాగంలో ఎటువంటి మార్పులు చేసే సూచనలు కన్పించడం లేదు. అర్షదీప్, సిరాజ్, ముఖేష్‌లతో కూడిన పేస్త్రయంతో భారత్ బరిలోకి దిగే ఛాన్స్ ఉంది.