భారత్ ఖాతాలో ఓ చెత్త రికార్డు చేరింది. టీ20 ఫార్మాట్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ చేతిలో మొదటిసారి ఆలౌటైంది. టీ20 ప్రపంచకప్ 2024 గ్రూప్-ఏలో భాగంగా ఆదివారం న్యూయార్క్‌లోని నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ సేన 119 పరుగులకు ఆలౌట్ అయింది. పాకిస్థాన్‌పై ఆడిన ఎనిమిది మ్యాచ్‌ల్లో భారత్ ఆలౌటవ్వడం ఇదే మొదటిసారి.
టీ20 ప్రపంచకప్‌లో భారత్ నాలుగో అత్యల్ప స్కోరును నమోదు చేసింది. టీ20 ప్రపంచకప్‌లో భారత్ అత్యల్ప స్కోరు 79. 2016లో న్యూజిలాండ్‌పై ఈ స్కోర్ చేసింది. 2021లో న్యూజిలాండ్పైనే 110/7 పరుగులు చేసిన భారత్.. 2009లో దక్షిణాఫ్రికా 118/8 స్కోర్ చేసింది. తాజాగా పాకిస్థాన్‌పై 119 పరుగులు చేసింది. పొట్టి ప్రపంచకప్‌లో భారత్ అత్యధిక స్కోర్ 218/4గా ఉంది. 2007 ప్రపంచకప్‌లో అత్యధిక స్కోర్ నమోదు చేసింది. ఇక టీ20ల్లో ఇండియా అత్యధిక స్కోర్ 260/5. 2017లో శ్రీలంకపై భారీ స్కోర్ చేసింది.
స్వల్ప స్కోర్ చేసిన భారత్.. పాకిస్థాన్‌కు భారీ షాక్ ఇచ్చింది. బౌలర్లు చెలరేగడంతో 6 పరుగుల తేడాతో అద్భుత విజయం సాధించింది. 120 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 113 పరుగులకే పరిమితమైంది. ఓపెనర్ రిజ్వాన్ (31) టాప్ స్కోరర్. జస్ప్రీత్ బుమ్రా (3/14), హార్దిక్ పాండ్యా (2/24) పాక్ పని పట్టారు.