ఆదివారం నుంచి కూల్చివేతల్లో నిమగ్నమైన హైడ్రా బుల్డోజర్లు సోమవారం కూడా ఆక్రమణల అంతు చూసింది. మాదాపూర్‌లోని కావూరి హిల్స్ పార్కు స్థలంలోని అక్రమ షెడ్లపై పంజా విసిరింది. కూల్చివేతలపై కావూరి హిల్స్ వాసులు ఆనందం వ్యక్తం చేస్తుంటే .. టెన్నిస్ కోర్టు నిర్వాహకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టెన్నిస్ కోర్టు లీజు ముగిశాక…
హైదరాబాద్‌లో హైడ్రా మరోసారి పంజా విసిరింది. అక్రమ నిర్మాణాలు చేపట్టిన ప్రాంతాల్లో బుల్డోజర్లు హారన్లు మోగిస్తున్నాయి. హైడ్రా దూకుడుతో అక్రమార్కులు హడలిపోతున్నారు. అయితే దుర్గంచెరువు పరిసరాల్లో హైడ్రా కూల్చివేతలపై తెలంగాణ హైకోర్ట్ కీలక ఆదేశాలు జారీ చేసింది. హైదరాబాద్‌లో హైడ్రా బుల్డోజర్ ఆపరేషన్ కొనసాగుతోంది. ప్రభుత్వ భూములు, చెరువుల పరిరక్షణనే లక్ష్యంగా అక్రమ నిర్మాణాలు కూల్చేస్తోంది.
ఆదివారం నుంచి కూల్చివేతల్లో నిమగ్నమైన హైడ్రా బుల్డోజర్లు సోమవారం కూడా ఆక్రమణల అంతు చూసింది. మాదాపూర్‌లోని కావూరి హిల్స్ పార్కు స్థలంలోని అక్రమ షెడ్లపై పంజా విసిరింది. కూల్చివేతలపై కావూరి హిల్స్ వాసులు ఆనందం వ్యక్తం చేస్తుంటే .. టెన్నిస్ కోర్టు నిర్వాహకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టెన్నిస్ కోర్టు లీజు ముగిశాక కూడా నిర్వాహకులు పార్క్ స్థలంలో తిష్టవేసి ఆ స్థలాన్ని ఆక్రమించారని కావూరి హిల్స్ వాసులు చెబుతున్నారు. అయితే అక్కడ పార్కే లేదంటున్నారు టెన్నిస్ కోర్టు నిర్వాహకులు.
సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ మున్సిపాలిటీలోనూ అక్రమ నిర్మాణాలపై అధికారులు ఉక్కుపాదం మోపారు. సర్వే నం 993లోని ప్రభుత్వ భూమిలో 7 నిర్మాణాలపై బుల్డోజర్ విరుచుకుపడింది. అమీన్పూర్ మున్సిపల్ కృష్ణారెడ్డిపేట గ్రామపంచాయతీ పరిధిలో సర్వే నెం. 164లో ఉన్న నిర్మాణాలు నేలమట్టం చేశారు. ఇక ఆదివారం కూకట్‌పల్లిలోని నల్లచెరువును ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను నేలమట్టం చేసింది. ఎకరంపైగా ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకుంది. తీవ్ర భావోద్వేగాల మధ్య జరిగిన ఈ కూల్చివేతల్లో హైడ్రా ఎక్కడా వెనుకంజ వేయకుండా తన పని పూర్తి చేసింది. అయితే కూకట్‌పల్లిలో హైడ్రా కూల్చివేత జరిగిన తీరును ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తప్పుబట్టారు.
మరోవైపు హైడ్రాకు తెలంగాణ హైకోర్ట్ కీలక ఆదేశాలు జారీ చేసింది. దుర్గంచెరువు పరిసరాల్లో హైడ్రా కూల్చివేతలపై హైకోర్ట్ స్టే విధించింది. 2014లో జారీ చేసిన ప్రిలిమినరీ నోటిఫికేషన్‌పై దుర్గం చెరువు పరిసర నివాసితులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఈ మేరకు వారు పిటిషన్ దాఖలు చేశారు. ఈ అభ్యంతరాలను లేక్ ప్రొటెక్షన్ కమిటీ పరిగణలోకి తీసుకోవాలని హైకోర్ట్ పేర్కొంది. అక్టోబర్ 4న లేక్ ప్రొటెక్షన్ కమిటీ ముందు దుర్గం చెరువు పరిసర నివాసితులు హాజరు కావాలని కోర్ట్ తెలిపింది. అభ్యంతరాలను పరిగణలోకి తీసుకొని అక్టోబర్ 4 నుంచి ఆరు వారాల లోపు తుది నోటిఫికేషన్ జారీ చేయాలని స్పష్టం చేసింది. దీంతో దుర్గం చెరువు పరిసర నివాసితులకు ఊరట దక్కినట్టు అయ్యింది.