హైదరాబాద్ మహా నగరంపై పింక్ బ్రాండ్‌ని చెరిపేసి, మూడు రంగుల మార్కు, మార్పు చూపించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అడుగులు వేస్తున్నారా? బడ్జెట్‌లో హైదరాబాద్‌కు హై ప్రయారిటీ, వేల కోట్ల కుమ్మరింపు దానిలో భాగమేనా? మార్పు మంత్రంతో హమారా షహర్‌లో ఎలాంటి మార్పులు రానున్నాయి? ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న చర్చ.
చార్ సౌ సాల్ పురానా సిటీ, హమారా షహర్ హైదరాబాద్. భాగ్యనగరం అంటేనే ఓ బ్రాండ్. హైటెక్ సిటీతో ఐటీ ఇమేజ్. ఇండియాలో ది మోస్ట్ హ్యాపెనింగ్ సిటీ. గత పదేళ్ల కేసీఆర్ పాలనలో బ్రాండ్ హైదరాబాద్‌కి కొత్త మెరుగులు దిద్దారు. సరికొత్త హంగులు అద్దారు. నగరంలో ప్రయాణికులను చకచకా గమ్య స్థానాలకు చేర్చే మెట్రో రైలుతో పాటు, దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్, ట్రాఫిక్ కష్టాలు తీర్చే ఫై ఓవర్లు.. ఇలా ఒకటేమిటి.. హైదరాబాద్‌కి నయా లుక్ తెచ్చారు కేసీఆర్. అందుకేనేమో గ్రేటర్ పరిధిలో.. ఓల్డ్ సిటీ మినహాయించి దాదాపు అన్ని అసెంబ్లీ సీట్లను గులాబీ పార్టీ కైవసం చేసుకుంది.
నయా హైదరాబాద్. నయా ఇస్మార్ట్ సిటీ జిందగీ. నగరం గురించి చర్చ వస్తే… అంతా మేమేం చేశాం అని చెప్పుకుంటుంది బీఆర్ఎస్. హైదరాబాద్ నగరంపై బీఆర్‌ఎస్ బ్రాండ్ బలంగానే ఉంది. అయితే ఇప్పుడు ఆ పింక్ బ్రాండ్‌కి చెక్ పెట్టి, తనదైన మార్క్‌తో హైదరాబాద్‌లో మార్పు చూపించబోతోందా అధికార కాంగ్రెస్ పార్టీ. నవాబుల తీన్మార్ సిటీకి..మూ డు రంగులతో నయా బ్రాండ్ తెచ్చేవిధంగా, కాంగ్రెస్ తన మార్క్ అద్దాలనుకుంటోందా? అందుకే తెలంగాణ బడ్జెట్‌లో హైదరాబాద్ అభివృద్ధికి పెద్ద పీట వేశారా అంటే..అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు.
ఇప్పటికే హైడ్రా, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్, రీజనల్ రింగ్ రోడ్ లాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను ముందుకు తెస్తున్నారు సీఎం రేవంత్. తన డ్రీమ్ ప్రాజెక్టులతో భాగ్య నగరానికి మెరుపు కలలు, కళలు తేవాలనే గట్టి పట్టుదలతో ముందుకు అడుగులు వేస్తున్నారు ముఖ్యమంత్రి. హైదరాబాద్ నగరాభివృద్ధిపై స్పెషల్ ఫోకస్ పెట్టింది ప్రభుత్వం. దీనిలో భాగంగా.. ఎన్నడూ లేని విధంగా తెలంగాణ బడ్జెట్‌లో భాగ్య నగరానికి భళా అనిపించేలా పది వేల కోట్ల రూపాయల కేటాయింపులు చేసింది కాంగ్రెస్ సర్కార్.
బడ్జెట్‌లో హైదరాబాద్‌కి కేటాయించిన పది వేల కోట్ల రూపాయలను వివిధ శాఖలకు కేటాయించనున్నారు. GHMCకి రూ. 3,065 కోట్లు, HMDAకి రూ. 500 కోట్లు కేటాయించారు. మెట్రో వాటర్ వర్క్స్‌కు రూ.3,385 కోట్లు, హైడ్రాకు 200, అటు ఓల్డ్ సిటీకి, ఇటు శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు మెట్రో రైలు పొడిగింపు కోసం 600 కోట్లు కేటాయించారు. ఇక ఎంఎంటీఎస్‌కి 50కోట్లు, మూసీ డెవలప్‌మెంట్ ప్రాజెక్టుకు 1500 కోట్ల కేటాయింపులు జరిపారు. ఈ కేటాయింపులతో నగరంలో అభివృద్ధితో పాటు మౌలిక సదుపాయాలపై కూడా రేవంత్ సర్కార్ ఫోకస్ చేస్తోంది.
బడ్జెట్‌లో హైదరాబాద్‌కు పది వేల కోట్ల రూపాయలను కేటాయించి…ప్రపంచ స్థాయి నగరంగా మార్చే విజన్‌తో ముందుకు వెళుతున్నామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఈ కేటాయింపులతో హైదరాబాదీల జీవన ప్రమాణాలు మెరుగు పడతాయని, ఆర్థిక, సాంస్కృతిక కేంద్రంగా హైదరాబాద్ స్థానం మరింత సుస్థిరమవుతుందన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. హైదరాబాద్‌కు నయా బ్రాండ్…అది కూడా కాంగ్రెస్ మార్కుతో నగరంపై సరికొత్త ముద్ర వేయడానికి, పాత వాసలను చెరిపెయ్యడానికి, రేవంత్ సర్కార్ పక్కా ప్రణాళికతో ముందుకు వెళుతోందంటున్నారు విశ్లేషకులు.