ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను వర్షాలు వీడటం లేదు. ఇప్పటికే బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో గత కొన్ని రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్‌లో భారీగావర్షాలు కురుస్తునే ఉన్నాయి.
తెలుగు రాష్ట్రాల ప్రజలకు మరో బాంబు లాంటి వార్తను చెప్పింది వాతావరణ శాఖ. ఓ వాయుగుండం ఇలా తీరం దాటిందో లేదో.. మరో అల్పపీడనం బంగాళాఖాతంలో ముంచుకొస్తోందని హెచ్చరించింది. ఈ నెల 20న ఉత్తర అండమాన్ సముద్రంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని.. అది అక్టోబర్ 22 కల్లా పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం మారే ఛాన్స్‌లు ఉన్నాయని పేర్కొంది. ఆ తర్వాత ఉత్తర వాయువ్య దిశగా కదిలి మరింత బలపడనుందని ఐఎండీ స్పష్టం చేసింది. దీని ప్రభావంతో ఈ నెల 21 నుంచి ఏపీలోని పలు ప్రాంతాలలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. నాలుగు రోజుల పాటు ఏపీకి వర్ష సూచన ఉన్నట్టు విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అక్టోబర్ 22న అల్పపీడన ఏర్పడిన తర్వాత వర్షాల తీవ్రత మరింత కొనసాగే అవకాశం ఉందని ప్రకటించింది.
అటు తెలంగాణకు భారీ వర్ష సూచన అలెర్ట్ ఇచ్చింది. ఆదిలాబాద్, కొమరం భీమ్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నల్లగొండ, మహబూబాబద్, వరంగల్, హన్మకొండ, జనగాం, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణ పేట, గద్వాల జిల్లాలకు వర్షాలు అలెర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందంది. హైదరాబాద్ నగరంలోని కొన్ని ప్రాంతాలలో కూడా మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందట.