పాత రికార్డులు బ్రేక్.. కోట్లు కుమ్మరించి మరీ గణేష్ లడ్డూలు ఎందుకు కొంటున్నారు?

పాత రికార్డులు బ్రేక్.. కోట్లు కుమ్మరించి మరీ గణేష్ లడ్డూలు ఎందుకు కొంటున్నారు?

ప్రతియేటా జరిగే గణేష్ ఉత్సవాల్లో అందరి ఫోకస్ లడ్డూ వేలంపై కూడా ఉంటుంది. ఎప్పటిలానే గణేష్ లడ్డూలను దక్కించుకునేందుకు ఈసారి కూడా వేలంలో పోటాపోటీ నెలకొంది. నెవ్వర్ బిఫోర్ అనేలా.. కోట్లు కుమ్మరించి కొంగు బంగారంగా నిలిచే గణనాథుని లడ్డూలను దక్కించుకున్నారు భక్తులు. చాలా చోట్ల భక్తుల పాలిట కొంగు బంగారంగా నిలిచే లడ్డూ ప్రసాదం సరికొత్త రికార్డులు నమోదు చేశాయి. కేజీల బరువుండే గణేష్ లడ్డూను దక్కించుకుంటే టన్నుల కొద్దీ అదృష్టం తమ తలుపు తడుతుందన్న భక్తుల నమ్మకమే దీనికి కారణం. దీంతో తగ్గేదే లే అంటూ గణేష్ లడ్డూ వేలం పాటలో భక్తుల మధ్య గట్టిపోటీ నెలకొంది.

రికార్డులు తిరగరాసిన బాలాపూర్ లడ్డూ..

బాలాపూర్‌ గణేష్‌ అంటే అందరికీ గుర్తొచ్చేది లడ్డూ వేలం పాటే. ఇక్కడ విగ్రహం ఎత్తు కంటే.. బాలాపూర్‌ గణేషుడి చేతిలో ఉంటే లడ్డూపైనే అందరి ఫోకస్‌ ఉంటుంది. ఎందుకంటే, వేలం పాటలో ప్రతియేటా బాలాపూర్ లడ్డూ పాత రికార్డులను చెరిపేస్తూ సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ముందుగా ఊహించినట్టే బాలాపూర్‌ గణేష్‌ లడ్డూకు ఈ సారి కూడా వేలంపాటలో పట్ట పగ్గాల్లేకుండా పోయింది. మరోసారి రికార్డు ధర పలికింది. 30వ ఏట జరిగిన బాలాపూర్‌ లడ్డూ వేలం పాటలో ఏకంగా రూ. 30 లక్షలు క్రాస్‌ చేసింది. రూ. 30,01,000 లకు కొలను శంకర్‌రెడ్డి బాలాపూర్ లడ్డూను దక్కించుకున్నారు. గతేడాది కంటే రూ.3,01,000 అధికంగా పలికింది బాలాపూర్‌ లడ్డూ. గత సంవత్సరం రూ. 27లక్షల రూపాయలు పలకగా.. ఈసారి రూ. 30,01,000 వరకూ వెళ్లింది. అంతేకాదు, అత్యధికసార్లు బాలాపూర్‌ లడ్డూను దక్కించుకున్న కొలను కుటుంబమే మరోసారి కైవసం చేసుకోవడం విశేషం. గణేష్ లడ్డూతో తమకు అదృష్టం దక్కుతుందన్న నమ్మకంతోనే దీన్ని సొంతం చేసుకున్నట్లు కొలను శంకర్ రెడ్డి చెప్పారు.

30ఏళ్లుగా బాలాపూర్‌ లడ్డూ రికార్డులు బద్దలుకొడుతూనే ఉంది. తన రికార్డులను తానే బ్రేక్‌ చేస్తూ సరికొత్త రికార్డులను క్రియేట్‌ చేస్తున్నాడు బాలాపూర్‌ గణేష్‌. ఈ ఏడాది ఐదారుగురు మధ్యే పోటీ తీవ్రంగా నడిచింది. చివరికి, కొలను శంకర్‌రెడ్డి లడ్డూను దక్కించుకున్నారు. బాలాపూర్‌ లడ్డూ వేలానికి 30ఏళ్ల చరిత్ర ఉంది. బాలాపూర్‌ లడ్డూ రికార్డు ధర పలకడమే కాదు.. దాన్ని దక్కించుకున్నవారికి కొంగ బంగారంగా నిలుస్తోంది. 1994 నుంచి 2001 వరకు వేలల్లో మాత్రమే పలికిన లడ్డూ ధర.. 2002 నుంచి లక్షల్లోకి చేరింది. ఇక, ఇప్పుడు ఏకంగా 30 లక్షలు దాటిపోయింది బాలాపూర్‌ లడ్డూ ధర.

బాలాపూర్‌ లడ్డూ వేలం ధర..

1994 రూ.450

1995 రూ.4500

1996 రూ.18,000

1998 రూ.51,000

1999 రూ.65,000

2000 రూ.66,000

2001 రూ.85,000

2002 రూ.1,05,000

2003 రూ.1,55,000

2004 రూ.2,01,000

2005 రూ.2,08,000

2006 రూ.3,00,000

2007 రూ.4,15,000

2008 రూ.5,07,000

2009 రూ.5,10,000

2010 రూ.5,35,000

2011 రూ.5,45,000

2012 రూ.7,50,000

2013 రూ.9,26,000

2014 రూ.9,50,000

2015 రూ.10,32,000

2016 రూ.14,65,000

2017 రూ.15,60,000

2018 రూ.16,60,000

2019 రూ.17,60,000

2021 రూ.18,90,000

2022 రూ.24,60,000

2023 రూ.27,00,000

2024 రూ.30,01,000

బండ్లగూడ లడ్డూ రూ.1.86 కోట్లు

బండ్లగూడ గణేశ్ లడ్డూ వేలం పాటలో ఆల్ టైమ్ రికార్డు స్థాయి ధర పలికింది. రంగారెడ్డి జిల్లా బండ్లగూడ జాగిర్ మున్సిపల్ పరిధిలోని కీర్తి రిచ్ మండ్ విల్లాస్‌లో నిర్వహించిన లడ్డూ వేలంలో రూ.1.87 కోట్లు ధర పలికింది గణపతి లడ్డూ ప్రసాదం. గత ఏడాది రికార్డు బ్రేక్ అయ్యింది. గత ఏడాది లడ్డూ ప్రసాదం రూ.1.26 కోట్ల రూపాయలకు వేలంపోయింది. అయితే ఈసారి ఏ ఒక్కరో కాకుండా.. 25 మంది టీమ్‌గా ఏర్పడి ఈ లడ్డూను దక్కించుకోవడం విశేషం. గణేష్ లడ్డూ వేలం పాటతో వచ్చిన డబ్బుతో పేదలకు సాయం చేయనున్నట్లు ట్రస్ట్ ప్రకటించింది. పేద ప్రజలు, హాస్టల్స్‌లోని విద్యార్ధులకు సహాయ సహకారాలు అందించనున్నారని ట్రస్ట్ సభ్యులు చెబుతున్నారు.

మై హోమ్ భుజా లడ్డూ రూ.29 లక్షలు

ప్రతియేటా బాలాపూర్ లడ్డూకు ధీటుగా ఐటీ కారిడార్‌లోని మైహోం భుజా అపార్ట్‌మెంట్‌లో గణేష్ లడ్డూ వేలం జరుగుతోంది. ఈసారి కూడా రికార్డు ధర పలికింది. ఆదివారంనాడు నిర్వహించిన వేలంలో ఖమ్మం జిల్లాకు చెందిన వ్యాపారవేత్త కొండపల్లి గణేశ్ రూ.29 లక్షలకు అత్యంత పవిత్రంగా భావించే లడ్డూ ప్రసాదాన్ని దక్కించుకున్నాడు. గత ఏడాది బాలాపూర్ లడ్డూ వేలంలో రూ.27 లక్షలు ధర పలకగా.. ఇక్కడి లడ్డూ రూ.25.50 లక్షలు పలికింది. ఈ సారి అంతకు మించి రూ.3.50 లక్షలు ఎక్కువగా రూ.29 లక్షల ధర పలికింది. వేలం పాటలో లడ్డూ ప్రసాదాన్ని సొంతం చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని కొండపల్లి గణేశ్ తెలిపారు. ఎల్లప్పుడూ ఆ గణనాథుని ఆశీస్సులు మా కుటుంబం పట్ల ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నానని అన్నారు. గతంలోనూ వేలంలో పాల్గొన్నా తమకు లడ్డూ దక్కలేదని.. ఈసారి గణేశుని అభయంతో లడ్డూ ప్రసాదాన్ని సొంతం చేసుకున్నట్లు చెప్పారు.

విజయవాడ లడ్డూ రూ.26 లక్షలు

విజయవాడలోనూ గణేష్ లడ్డూ రికార్డ్ సృష్టించింది. బాలాపూర్ లడ్డూ రేంజ్‌లో భారీ ధర పలికింది. విజయవాడ రూరల్ మండలం నున్నలోని శ్రీసాయి బాలాజీ ఎన్‌క్లేవ్ అపార్టుమెంట్‌లో నిర్వహించిన వేలంలో ఏకంగా రూ.26 లక్షలకు దక్కించుకున్నారు. విషోదా ఫిన్‌స్పైర్ సొల్యూషన్స్ ఎండీ సింగంరెడ్డి ప్రదీప్ రెడ్డి, నక్కా రామ్ బాలాజీలు రూ.26 లక్షలకు ఈ లడ్డూ ప్రసాదాన్ని సొంతం చేసుకున్నారు. గణపతి లడ్డూ ప్రసాదాన్ని వేలంపాటలో దక్కించుకోవడం పట్ల సింగంరెడ్డి ప్రదీప్‌రెడ్డి సంతోషం వ్యక్తంచేశారు. వచ్చే ఏడాది చవితి వేడుకలు మరింత వైభవంగా నిర్వహించుకోవాలనే ఉద్దేశంతోనే రూ.26 లక్షల పెద్ద మొత్తానికి వినాయక లడ్డూ పాట పాడామని తెలిపారు.

ముడిమ్యాలలో గణేష్ లడ్డూ రూ.12.16 లక్షలు

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ముడిమ్యాలలో గణేష్ లడ్డూ రూ.12.16 లక్షలు ధర పలికింది. వేలంలో అదే గ్రామానికి చెందిన హరికిషన్ రెడ్డి లడ్డూను దక్కించుకున్నారు.

లడ్డూను దక్కించుకున్న ముస్లీం వ్యక్తి..

కాగా వేలంలో ఓ ముస్లిం లడ్డూను దక్కించుకోవడం తెలంగాణ రాష్ట్రంలో ఓ ఆసక్తికర అంశం. కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా భట్‌పల్లిలో వినాయక వేలం పాటలో పాల్గొన్న అఫ్జల్ లడ్డూని సొంతం చేసుకున్నారు. వేలం పాటలో ఏకంగా రూ.13,216 లకు లడ్డూని గెలుచుకున్నారు. గణేష్ లడ్డూను గెలుచుకున్నందుకు ఆసిఫ్ భాయ్‌కి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అభినందనలు తెలిపారు. గంగా జమున తెహజీబ్.. ఇది తెలంగాణ ‘అసలు’ సంస్కృతి అని కామెంట్ చేశారు.

కేటీఆర్ ట్వీట్

గణేశునిపై అపారమైన భక్తితో లడ్డూ ప్రసాదం కోసం కోట్లు కుమ్మరించేందుకు కూడా భక్తులు వెనుకాడలేదు. నవరాత్రులు పూజలు అందుకున్న గణేష్ లడ్డూ అత్యంత పవిత్రమైనదిగా భక్తులు భావిస్తున్నారు. దీన్ని దక్కించుకుంటే అదృష్టం కలిసొస్తుందని భావించే వ్యాపారవేత్తలు కోట్లు కుమ్మరించి దీన్ని కొనుగోలు చేసేందుకు వెనుకాడలేదు. పేరు ప్రతిష్టలతో పాటు గణేషుని ఆశీస్సులతో తమ వ్యాపారం వృద్ధి చెందుతుందన్న నమ్మకంతో లడ్డూ ప్రసాదం కోసం పోటీపోటీపడ్డారు.

Please follow and like us:
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు