తెలంగాణ నార్కోటిక్ అధికారులు డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపుతున్నా.. హైదరాబాద్‌లో డ్రగ్స్ దందాలు మాత్రం ఆగడంలేదు. డ్రగ్ స్మగ్లర్లు ఏదో ఒక రూపంలో మత్తు పదార్థాలతో హైదరాబాద్ మహానగరంలో వాలిపోతూనే ఉన్నారు. దాంతో.. హైదరాబాద్‌లో వరుసగా డ్రగ్స్ ఆనవాళ్లు బయటపడుతూనే ఉన్నాయి. తాజాగా.. ఒక్కరోజే హైదరాబాద్‌లో రెండు చోట్ల డ్రగ్స్ భారీగా పట్టుబడడం షాకిస్తోంది. హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో మరోసారి డ్రగ్స్ భారీగా పట్టుబడ్డాయి. దాదాపు 7 కోట్ల విలువైన డ్రగ్స్‌ను డీఆర్‌ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
బ్యాంకాక్ నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికులను తనిఖీ చేసిన డీఆర్ఐ అధికారులు.. వారిపై అనుమానంతో చెక్ చేశారు. చెక్-ఇన్ లగేజీని క్రమపద్ధతిలో వెతకగా చాక్లెట్ ప్యాకెట్లలో 13 వాక్యూమ్ ప్యాకెట్లు బయటపడ్డాయి. దానిలో.. ఎండు గంజాయి రూపంలోనున్న హైడ్రోపోనిక్ వీడ్ లభ్యమైంది. ఇద్దరిపై ఎన్టీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.
మరోవైపు… హైదరాబాద్ చందానగర్‌లోనూ డ్రగ్స్ దొరికాయి. రాజస్థాన్ నుంచి డ్రగ్స్ తీసుకొచ్చిన తన ఫ్రెండ్‌ను రూపారామ్ అనే వ్యక్తి స్వయంగా పోలీసులకు పట్టించాడు. రాజస్థాన్ నుంచి వచ్చిన తన బంధువు కృష్ణారామ్ వ్యవహారశైలిపై రూపారామ్‌కు అనుమానం రావడంతో చెక్ చేయగా డ్రగ్స్ ప్యాకెట్లు లభ్యమయ్యాయి. దాంతో.. సీక్రెట్‌గా టీజీ న్యాబ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. కృష్ణారామ్ నుంచి సుమారు 150 గ్రాముల MDMA డ్రగ్ ప్యాకెట్ల స్వాధీనం చేసుకున్నారు. ఇక.. నిందితుడు కృష్ణారామ్.. మధ్యప్రదేశ్‌కు చెందిన సమీర్‌ఖాన్, రాజస్థాన్ వాసి లూథరామ్ దగ్గర కొనుగోలు చేసినట్లు గుర్తించామన్నారు పోలీసులు. అలాగే.. హైదరాబాద్‌లో ఉన్న ఇద్దరు వ్యక్తులకు సప్లయ్ చేసేందుకు తెచ్చినట్లు వెల్లడించారు.