ప్రమాదవశాత్తు పాము కాటుకు గురైన వ్యక్తి టెన్షన్ పడకుండా చూసుకోవాలి. శరీరాన్ని ఎక్కువగా కదపకూడదు. పరిగెత్తకూడదు. ఇలా చేస్తే గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది. అప్పుడు విషం వేగంగా శరీరమంతా వ్యాపిస్తుంది. అందుకే టెన్షన్ పడకుండా ధైర్యంగా ఉండాలి.
పాములంటే సాధారణంగానే అందరికీ భయమే..కొన్ని రకాల పాములు కాటేస్తే క్షణాల్లో ప్రాణాలు పోయే ప్రమాదం ఉంటుంది. అందుకే పాములను చూసినా, పాము పేరు వినిపించినా చాలా మంది భయంతో పరుగులు తీస్తారు. అక్కడెక్కడో పాము ఉందని తెలిస్తే చాలు ఇక్కడ్నుంచే పరుగులు మొదలుపెడతారు. ఇక పామును దగ్గరగా వచ్చిందంటే.. కొందరు ఆ భయంతోనే చనిపోతుంటారు. మరికొందరు ఎలా తప్పించుకోవాలో ఆలోచించకుండా పాముకాటుకు గురవుతుంటారు. కానీ, పాములన్నీ విషపూరితమైనవి కావు.. అయినప్పటికీ పాములకు దూరంగా ఉండటం మేలు. అయితే, పాము ఎదురుపడితే ఎలా తప్పించుకోవాలో కూడా తెలిసి ఉండటం మంచిది. విషపూరిత పాము కాటుకు గురైతే ఏం చేయాలి? పాము ఎదురు పడితే ఎలా తప్పించుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం..
ఎక్కడైనా, ఎప్పుడైనా పామును ఎదురుపడితే భయపడకండి.. టెన్షన్ పడకూడదు. పాముకు ఎదురుగా ఎలాంటి కదలికలు చేయరాదు. పాము ఉన్న దిశలో పరుగెత్తకూడదు. లేదా పాముపై ఏదైనా విసిరేందుకు కూడా ప్రయత్నించకూడద్దు. మీరు వాటిని ఇబ్బంది పెట్టకుండా ఉన్నంత వరకు అవి మనకు ఎలాంటి హానీ చేయవని చెబుతున్నారు. ప్రశాంతంగా ఉండి దానికి దారిని కల్పిస్తే.. వాటంతట అవే వెళ్లిపోతాయి. అలాగే, చాలా పాములు మన దగ్గరికి రావడానికి ఇష్టపడవు, ఎందుకంటే అవి కూడా భయపడతాయట.
పాములకు చెవులు ఉండవని నిపుణులు చెబుతున్నారు కానీ అవి కంపనాలకు చాలా సున్నితంగా ఉంటాయని అంటున్నారు. అలాంటప్పుడు పెద్ద శబ్దాలు.. పాము నిశ్శబ్ద ప్రదేశానికి పారిపోయేలా చేస్తుంది. మీరు కొన్ని కర్రలను కలిపి కొట్టి సౌండ్ చేయడానికి కూడా ప్రయత్నించవచ్చు.
మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. పాములు ఎక్కువగా రాళ్లు, అడవుల్లోని గడ్డిపొదలు, మూలల్లో దాక్కోవడానికి ఇష్టపడతాయి. అలాంటి ప్రదేశాల దగ్గర నడిచేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అలాంటి ప్రదేశాలను క్లీన్ చేస్తున్నప్పుడు కూడా జాగ్రత్తగా చూసుకుని చేయాలి.
ప్రమాదవశాత్తు పాము కాటుకు గురైన వ్యక్తి టెన్షన్ పడకుండా చూసుకోవాలి. శరీరాన్ని ఎక్కువగా కదపకూడదు. పరిగెత్తకూడదు. ఇలా చేస్తే గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది. అప్పుడు విషం వేగంగా శరీరమంతా వ్యాపిస్తుంది. అందుకే టెన్షన్ పడకుండా ధైర్యంగా ఉండాలి. పాము కాటేసిన చోట గాయాన్ని కోసి.. విషాన్ని బయటకు తీసే ప్రయత్నం కూడా చేయరాదు. పాము కాటువేసిన గాయం చుట్టూ టేపు లాంటిది కూడా కట్టకూడదని నిపుణులు చెబుతున్నారు. సాధ్యమైనంత త్వరగా దగ్గర్లోని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాలని చెబుతున్నారు. అంతేకానీ, మంత్రాలు, చెట్ల మందులను ఆశ్రయించరాదని చెబుతున్నారు.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)