ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిధుల వరద.. కేంద్ర బడ్జెట్‌లో వరాల జల్లు.. ఏపీ విభజన సమస్యల క్లియరెన్స్ దిశగా కేంద్ర అడుగులు వేస్తోంది. ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వచ్చిన ఎన్డీయే సర్కార్.. బడ్జెట్‌లో ఏపీకి పెద్దపీట వేసింది. ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధికి ప్రత్యేక నిధులు ఇవ్వనున్నట్లు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో ప్రకటించడంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
బడ్జెట్‌లో కేటాయింపులపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. నిధుల కేటాయింపులపై ప్రధాని మోదీకి సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. బడ్జెట్‌లో నిధులు కేటాయించిన కేంద్రం, అవసరమైతే మరింతగా పెంచుతామని చెప్పడం సంతోషకరమన్నారు. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడంతోపాటు ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని నెరవేర్చాలన్న సంకల్పం మన రాష్ట్ర అభివృద్ధికి దోహదపడుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి ఇది శుభపరిణామమన్నాుు. రాష్ట్ర పుననిర్మాణానికి కట్టుబడి ఉన్నామని మోదీ ప్రభుత్వం ప్రకటించడం హర్షణీయమన్నారు. ఏపీ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చిన ప్రధానమంత్రి మోదీకి ఏపీ ప్రజల తరుఫున కృతజ్ఞతలని ఆయన ట్విట్టర్ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.
కేంద్ర బడ్జెట్‌లో నిధుల కేటాయింపు ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖ పురోగతి వైపు దూసుకుపోతుందన్నారు పవన్ కల్యాణ్. రాజధాని కోసం ఏపీ ప్రజల ఆవశ్యకతను గుర్తించడంలో, పారిశ్రామిక వృద్ధిని పెంచడంలో, వెనుకబడిన ప్రాంతాలకు సహాయం చేయడంలో మోదీ మద్దతు అభినందనీయమన్నారు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు పట్ల దూరదృష్టితో నిధులు కేటాయించడం, ఇది ఎన్డీయే సర్కార్‌కు ఉన్న నిబద్ధత అన్నారు. మోదీ నిర్ణయం ఆంధ్రప్రదేశ్ ప్రజలలో మరింత విశ్వాసాన్ని పెంపొందించిందన్నారు. ఏపీ రాష్ట్రాన్ని పునరుద్ధరించడానికి మోదీ ప్రయత్నాలకు హృదయపూర్వక ధన్యవాదాలు అంటూ సోషల్ మీడియా ఎక్స్ ద్వారా వెల్లడించారు పవన్ కల్యాణ్.
ఈ ఆర్ధిక సంవత్సరంలో వరల్డ్ బ్యాంక్ సాయంతో అమరావతికి 15వేల కోట్ల రూపాయల ప్రత్యేక సాయాన్ని అందిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. మరోవైపు.. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ బాధ్యత కూడా కేంద్రానిదేనని తెలిపారు. అటు.. రాయలసీమలో నాలుగు, ఉత్తరాంధ్రలో మూడు, ప్రకాశం లాంటి వెనుకబాటు జిల్లాల అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ కింద నిధులు విడుదల చేస్తామన్నారు నిర్మలా సీతారామన్. విశాఖపట్నం- చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, రాయలసీమ మీదుగా హైదరాబాద్ – బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్‌లు మంజూరు చేయడంతో పాటు త్వరలోనే నిధులు విడుదల చేస్తామని ఆమె ప్రకటించారు.
మోదీ 3.0 ప్రభుత్వం ఏర్పడటంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కీలకపాత్ర పోషించింది. ఎన్డీయే కూటమి ఎక్కువ సీట్లు గెలవడంతో మోదీ మరోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఏపీలో టీడీపీ ఉంటే తాము పొత్తులో కలిసే ప్రసక్తే లేదని బీజేపీ రాష్ట్ర నేతలు పంతం పట్టారు. కానీ వారిని ఒప్పించి కూటమిలోకి బీజేపీ రావడానికి పవన్ కల్యాణ్ కీలక పాత్ర పోషించారు. అందుకే ఢిల్లీలో ఎన్డీయే ప్రభుత్వం మరోసారి ఏర్పడటానికి కారణమైంది. ఈ నేపథ్యంలోనే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈసారి బడ్జెట్‌లో వరాల జల్లు కురిపించారు.