బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతోంది. ఉత్తర వాయువ్యంగా కదులుతూ శ్రీలంక, తమిళనాడు తీరాల వైపు పయనించే అవకాశం ఉంది. ఈ తీవ్ర వాయుగుండం..
తమిళనాడుతో పాటు ఏపీని తుఫాన్ భయపెడుతోంది. ప్రస్తుతం బంగాళాఖాతంలో కొనసాగుతోన్న తీవ్ర వాయుగుండం.. ఈ సాయంత్రానికల్లా తుఫాన్‌గా మారనుంది. ఈనెల 30న కారైకల్-మహాబలిపురం మధ్య తుఫాన్ తీరం దాటొచ్చని అంచనా వేస్తున్నారు. ఫెంగల్‌గా నామకరణం చేసిన ఈ తుఫాన్.. రెండు రోజుల్లో చెన్నై- పుదుచ్చేరి మధ్య తీరం దాటనుంది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వచ్చే ఐదు రోజుల్లో దక్షిణ కోస్తా, రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయని తెలిపారు విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్.
ఇప్పటికే.. తీర ప్రాంతాల్లో భారీ ఈదురుగాలులు వీస్తుండగా.. ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రధానంగా.. గూడూరు, కావలి, ఉదయగిరి, ఆత్మకూరు, సూళ్లూరుపేట, అల్లూరుతోపాటు మరికొన్ని మండలాల్లో మోస్తారు నుండి భారీ వర్షాలు పడుతున్నాయి. దాంతో.. తీర ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్ళవద్దని హెచ్చరించారు. అన్ని పోర్టుల్లో ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. అటు.. ఉత్తరాంధ్రలోని కొన్ని చోట్ల కూడా మోస్తరు వానలు పడుతున్నాయి. ఫెంగల్ తుఫాన్ ప్రభావం తమిళనాడులోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాయుగుండం ప్రస్తుతం చెన్నైకి 490 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. వాయుగుండం ప్రభావంతో చెన్నై సహా 8 జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయ్. నాగపట్నంలో వర్ష బీభత్సానికి పంటపొలాలు నీటమునిగాయి. తిరువారూర్, నాగపట్నంలో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు అధికారులు.
మరోవైపు వాయుగుండం ప్రభావంతో ఆంధ్రాలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. దక్షిణకోస్తా, రాయలసీమ, ఉత్తర కోస్తాలో జోరువానలు పడుతున్నాయ్. నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, ప్రకాశం జిల్లాల్లో ఈరోజు కుండపోత వర్షాలు కురుస్తాయంటున్నారు అధికారులు. రానున్న ఐదు రోజులపాటు ఏపీలో విస్తారంగా వర్షాలు కురవనున్నాయి. తీరం వెంబడి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది వాతావరణ శాఖ.