టూరిజం అభివృద్ధిపై తెలంగాణ ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఖమ్మం జిల్లాలో పర్యాటకం అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తోంది. టూరిజం ప్రమోషన్‌లో భాగంగా జిల్లాలో పలు ప్రాంతాల్లో పర్యటించారు మంత్రులు, డిప్యూటీ సీఎం. టూరిజం అభివృద్ధిపై అధికారులతో చర్చించారు. టూరిజం అభివృద్ధికి సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టూరిజం అభివృద్ధి పై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. అపార అటవీ సంపద, జలాశయాలు, పురాతన పర్యాటక ప్రదేశాలను సమగ్రంగా అభివృద్ధి చేయాలనీ నిర్ణయించింది. ఈ మేరకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి, తుమ్మల, జూపల్లి కృష్ణారావులు జిల్లాలో సుడిగాలి పర్యటనలు చేశారు. ఖమ్మం ఖిల్లా రోప్ వే పనులు త్వరలో ప్రారంభించి .. వీలైనంత త్వరగా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నేలకొండపల్లి బౌద్ధ ఆరామానికి బుద్ధిష్టులను ఆహ్వానించి ప్రపంచవ్యాప్తంగా ప్రచారం కల్పించాలని నిర్ణయించారు. నేలకొండపల్లిలో ఉత్సవాలు నిర్వహించి.. జపాన్ లాంటి దేశాల నుంచి ప్రపంచవ్యాప్తంగా ఉన్న బౌద్ధ ప్రచారకులను ఆహ్వానిస్తే మంచి గుర్తింపు వస్తుందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. కాంగ్రెస్ ప్రభుత్వం టూరిజాన్ని పూర్తిగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తుందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఫండ్స్ పూర్తిస్థాయిలో కేటాయిస్తామన్నారు భట్టి.
ఖమ్మం జిల్లాలో ఎకో టూరిజం, టెంపుల్ టూరిజం అభివృద్ధికి పుష్కలంగా అవకాశాలు ఉన్నాయని చెప్పారు పర్యాటక శాఖమంత్రి జూపల్లి కృష్ణారావు. కిన్నెరసాని నుంచి భద్రాచలం వరకు అడవులు ఎకో టూరిజానికి అణువుగా ఉందని చెప్పారు. నేలకొండపల్లిలోని బౌద్ధ స్తూపం మొదలు జమలాపురం మీదుగా భద్రాచలంలోని సీతారాముల ఆలయం వరకు టెంపుల్ టూరిజం అభివృద్ధికి పుష్కలంగా అవకాశాలు ఉన్నాయన్నారు. హైదరాబాద్ సాఫ్ట్వేర్ కేంద్రం ఆ ఉద్యోగులు నెలకొకసారి సెలవు దొరికితే ప్రశాంతంగా గడిపేందుకు అడవుల్లో ట్రెక్కింగ్, వాకింగ్ ట్రాక్, రిస్టార్ట్స్, ఇంటర్నెట్ వంటి సదుపాయాలు కల్పించేందుకు ప్లాన్ చేస్తామన్నారు. అన్ని సౌకర్యాలు కల్పిస్తే ఆటవిడుపుతోపాటు అక్కడే పని చేసుకునే అవకాశం ఉంటుందన్నారు.
ఈనేపథ్యంలోనే సంబంధిత ఇరిగేషన్, ఫారెస్ట్, విద్యుత్తు పర్యాటక ఇతర శాఖల సమన్వయంతో అభివృద్ధి చేయడానికి ఒక వరల్డ్ బెస్ట్ కన్సల్టెన్సీ ఎంపిక చేసి కిన్నెరసాని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసే చర్యలు చేపడతామని మంత్రులు తెలిపారు. ఖమ్మం జిల్లా అధికారులు వెంటనే ప్రాజెక్టు రిపోర్టులు పంపితే కేంద్ర నిధులతో సమన్వయం చేసుకొని ముందుకు వెళ్తామన్నారు. పర్యాటక పటంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాను అద్భుతంగా తీర్చిదిద్దటమే తమ లక్ష్యమని చెప్పారు మంత్రులు.