ఢిల్లీలో సీఎం రేవంత్‌రెడ్డి వరుస భేటీలతో బిజీబిజీగా ఉన్నారు. అటు పార్టీ, ఇటు ప్రభుత్వ పరమైన అంశాలపై సమావేశాలు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ పెద్దలతో పాటు ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులను కూడా సీఎం రేవంత్ కలవనున్నారు. నేడు కేబినెట్ విస్తరణపై కాంగ్రెస్ అధిష్ఠానంతో మరోసారి చర్చలు జరిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనపై కాంగ్రెస్ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటన నేపథ్యంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు కాంగ్రెస్ అధిష్ఠానం నుంచి పిలుపు అందింది. దీంతో ఆయన ఢిల్లీ బయలుదేరారు. దీంతో నేడు కేబినెట్ విస్తరణతో పాటు, పీసీసీ నియామకంపై చర్చ ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. గత కొంతకాలంగా కేబినెట్ విస్తరణపై అనేక రకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ మధ్య సీఎం రేవంత్ తెలంగాణ గవర్నర్‌ను కలిసి చర్చించడం.. తాజాగా మరోసారి ఢిల్లీ బాట పట్టడంతో కేబినెట్ విస్తరణ వ్యవహారం మరోసారి జోరందుకుంది. బీఆర్ఎస్ను వీడిన రాజ్యసభ సభ్యుడు కే.కేశవరావు అధికారికంగా కాంగ్రెస్‌లో చేరిన సందర్భంగా రేవంత్ ఢిల్లీ వెళ్లారని కొందరు చెబుతున్నా.. కేబినెట్ విస్తరణ, కొత్త పీసీసీ చీఫ్ అంశంపైనే రేవంత్ ఫోకస్ పెట్టారని పలువురు అభిప్రాయపడుతున్నారు.
అయితే నిన్న ఖర్గే, కేసీ వేణుగోపాల్, మున్షీతో రేవంత్ భేటీ అయిన సీఎం రేవంత్.. దాదాపు రెండు గంటలపాటు చర్చించారు. కేబినెట్ బెర్త్‌ల భర్తీ అంశంతో పాటు కొత్త పీసీసీ చీఫ్ అంశంపై కూడా వీరి మధ్య చర్చకు వచ్చినట్టు సమాచారం. కొద్దిరోజుల క్రితమే ఢిల్లీ పర్యటనలో ఈ అంశంపై పార్టీ పెద్దలతో రేవంత్ రెడ్డి చర్చించారని.. కేబినెట్ విస్తరణపై అధిష్టానం నుంచి సూత్రప్రాయంగా అంగీకారం తీసుకున్నారనే వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో తాజాగా ఆయన పార్టీ పెద్దలతో ఏయే అంశాలపై క్లారిటీ తీసుకున్నారనే అంశంపై చర్చ జరుగుతోంది. మరోవైపు సీఎం రేవంత్ ఢిల్లీ టూర్‌పై ఆశావాహుల ఆసక్తికి మరో కారణం కూడా ఉందని తెలుస్తోంది. ఎల్లుండితో ఆషాఢ మాసం మొదలు కాబోతుంది. దీంతో రేపు ఒక్కరోజే అవకాశం ఉండటంతో కేబినెట్ విస్తరణ అంశంపై మరికొద్ది గంటల్లో ఏదో ఒక ప్రకటన ఉండొచ్చనే చర్చ జరుగుతోంది. అయితే మంత్రివర్గంలో చోటు, పీసీసీగా ఛాన్స్ కోసం తీవ్రమైన పోటీ నెలకొనడంతో.. ఈ అంశంపై అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందా? లేక మరికొంతకాలం ఆగుతుందా ? అన్నది కూడా సస్పెన్స్‌గా మారింది.
ఇవాళ ప్రధాని మోదీతో భేటీకానున్నారు సీఎం రేవంత్‌రెడ్డి. అయనతో పాటూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తోపాటు పలువురు కేంద్రమంత్రులను కలవనున్నట్లు సమాచారం. రాష్ట్రానికి రావల్సిన పెండింగ్ నిధులతో పాటు విభజన హామీల పరిష్కారానికి మార్గం సుగమం చేయాల్సిందిగా విజ్ఙప్తి చేయనున్నట్లు తెలుస్తోంది. దీనికి తోడూ ఏపీ సీఎం చంద్రబాబు కూడా ఢిల్లీలో ఉండటం.. జూలై 6న ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇదే విభజన చట్టానికి సంబంధించిన అంశాలపై చర్చలు జరిపే అవకాశం ఉండటంతో ఈ అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రానికి రావల్సిన నిధులు, ప్రాజెక్టుల అంశాలపై కేంద్ర పెద్దలతో చర్చించనున్నట్లు సమాచారం. కేంద్రం ఇచ్చే సమాధానంపై సీఎం చంద్రబాబు, రేవంత్ రెడ్డిల చర్చలో ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది.