తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతోనూ సిఎం భేటీ అయ్యే అవకాశం ఉంది. వరద నష్టం అంచనాలకు సంబంధించి కేంద్ర సాయాన్ని కోరనున్నారు. భేటీలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా వర్షం సృష్టించిన బీభత్సం, అస్తి, ప్రాణ, పంట నష్టాలపై సీఎం రేవంత్ ప్రధాని మోదీకి సమగ్ర నివేదికను అందజేయనున్నారు. దీనికి సంబంధించిన అపాయింట్‌ను ఫిక్స్ అయినట్టుగా తెలుస్తోంది. మరోవైపు ఢిల్లీ పర్యటనలో భాగంగా సిఎం రేవంత్ రెడ్డి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో నేడు భేటీ కానున్నారు. అదేవిధంగా వరద బాధితుల సహాయార్థం కేంద్రం నుంచి నిధులు విడుదల చేసి ఆదుకోవాలని హోంమంత్రిని కోరనున్నారు. సిఎంతో పాటు ఢిల్లీకి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా వెళ్లారు. పీసీసీ చీఫ్‌గా ఎంపికైన తర్వాత మహేశ్ కుమార్ తొలిసారి ఢిల్లీలో పర్యటిస్తున్నారు. పార్టీ పెద్దలను పీసీసీ చీఫ్ మర్యాదపూర్వకంగా కలవనున్నారు. సీఎంతో మహేశ్ కుమార్ గౌడ్ తోపాటు మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటిస్తున్నారు.
మంత్రవర్గ విస్తరణపై చర్చించే అవకాశం
కాంగ్రెస్ చీఫ్ ఖర్గే, సోనియాగాంధీని రేవంత్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ కలువనున్నారు. ఈరోజు సాయంత్రం కాంగ్రెస్ హైకమాండ్‌తో రేవంత్ రెడ్డి చర్చలు జరిపే అవకాశం ఉంది. ఈరోజు క్లారిటీ రాకపోతే.. రేపు కూడా ఢిల్లీలోనే ఉండి ఆరు పేర్లను ఫైనల్ చేయనున్నారు. నామినేటెడ్, ఎమ్మెల్సీ స్థానాల భర్తీ, పిసిసి చీఫ్ నియామకం పూర్తవ్వడంతో ప్రస్తుతం అందరి దృష్టి మంత్రివర్గ విస్తరణపైనే పడింది.
డిసెంబర్ 7న సిఎం రేవంత్ రెడ్డితో పాటు 11 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో ఇంకా ఆరు కేబినెట్ బెర్తులు ఖాళీగా ఉన్నాయి. హోం మంత్రిత్వశాఖ, మున్సిపల్, విద్య, మైనింగ్‌తో పాటు పలు కీలక శాఖలు సిఎం వద్దే ఉన్నాయి. కేబినెట్ విస్తరణలో పలువురు సీనియర్ మంత్రి పదవులు ఆశిస్తున్నారు. దీంతో ఎవరికి అవకాశం దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది.