ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొలిసారి జిల్లాల పర్యటన మొదలు పెట్టారు. అందులో భాగంగా మొదటిసారి వరంగల్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ వరంగల్ కు రానున్న సీఎం రేవంత్ రెడ్డి, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధితోపాటు వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై ఉన్నత స్థాయి సమీక్ష జరపనున్నారు. సీఎం పర్యటనకు అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు అట్టహాసంగా ఏర్పాటు చేశారు.
వరంగల్ స్మార్ట్ సిటీ అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి స్పెషల్ ఫోకస్ చేశారు. హైబదరాబాద్ నుండి ప్రత్యేక హెలికాప్టర్ లో మధ్యాహ్నం 1.30 నిమిషాలకు సంగెం మండలంలోని కాకతీయ మేఘా టెక్స్‌టైల్ పార్క్‌కు చేరుకుంటారు. టెక్స్‌టైల్ పార్క్ నిర్మాణ పనులను పరిశీలించిన అనంతరం రోడ్డు మార్గంలో వరంగల్ కు చేరుకుంటారు. మధ్యా్హ్నం 2.30 గంటకు 24 అంతస్తుల మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణ పనులను పరిశీలిస్తారు. అక్కడి నుండి మధ్యాహ్నం 2.45 గంటలకు హనుమకొండ కలెక్టరేట్‌కు చేరుకుంటారు. సాయంత్రం 5.30 గంటల వరకు వరంగల్ అభివృద్ధిపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహిస్తారు..
ముఖ్యమంత్రి సమీక్ష ఎజెండాలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కుడా మాస్టర్ ప్లాన్, ఔటర్ రింగ్ రోడ్డు, ఎంజీఎం ఆస్పత్రి ప్రక్షాళన, మామునూరు ఎయిర్ పోర్ట్, రోడ్ల విస్తరణ, మోడల్ బస్టాండ్ నిర్మాణంతో పాటు వివిధ అభివృద్ది పనులపై సమీక్ష జరుపుతారు. ఈ నేపపథ్యంలోనే ఆయా శాఖల ఉన్నతాధికారులు ఇప్పటికే పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నారు. సమీక్ష అనంతరం సాయంత్రం 5.40 గంటలకు హంటర్ రోడ్‌లోని మెడికవర్ సూపర్ స్పెషలిటీ ఆస్పత్రిని ప్రారంభిస్తారు. ఆ తర్వాత తిరిగి హైదరాబాద్ కు వెళ్తారు.
సీఎం తొలిసారి వరంగల్ అభివృద్ధిపై ఉన్నత స్థాయి సమీక్ష జరుపుతున్న నేపథ్యంలో వరంగల్ అధికార యంత్రాంగం ప్రజాప్రతినిధులు అట్టహాసంగా ఏర్పాట్లు చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి ఘనస్వాగతం పలికేందుకు భారీ ఎత్తున హార్డింగ్స్, ఫ్లెక్సీలతో వరంగల్ నగరమంతా నింపేశారు. మరోవైపు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు..