తెలంగాణకు పెట్టుబడులే లక్ష్యంగా అమెరికాలో సీఎం రేవంత్ టీమ్ వేట కొనసాగుతోంది. బ్రేక్‌ఫాస్ట్ భేటీలు, లంచ్ మీటింగ్‌లతో అమెరికాలో బిజీబిజీగా గడుపుతోంది. మూడవ రోజు పర్యటనలో రోజంతా పెట్టుబడులు, ఒప్పందాలపైనే ఫోకస్ పెట్టగా..
తెలంగాణకు పెట్టుబడులే లక్ష్యంగా అమెరికాలో సీఎం రేవంత్ టీమ్ వేట కొనసాగుతోంది. బ్రేక్‌ఫాస్ట్ భేటీలు, లంచ్ మీటింగ్‌లతో అమెరికాలో బిజీబిజీగా గడుపుతోంది. మూడవ రోజు పర్యటనలో రోజంతా పెట్టుబడులు, ఒప్పందాలపైనే ఫోకస్ పెట్టగా.. పలు కంపెనీలతో MOUలు జరిగాయి. ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్ కొత్తగా కంపెనీని విస్తరించేందుకు ముందుకు రాగా.. కొన్ని కంపెనీలు తెలంగాణలో పెట్టుబుడులు పెట్టేందుకు సై అన్నాయి.
ప్రఖ్యాత ఐటీ సంస్థ కాగ్నిజెంట్ తెలంగాణలో భారీ విస్తరణకు రెడీ అయింది. హైదరాబాద్‌లో దాదాపు 15 వేల మందికి ఉద్యోగాలు కల్పించేలా సుమారు 10లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో కొత్త సెంటర్ నెలకొల్పనున్నట్లు ప్రకటించింది. దీనికి సంబంధించి అమెరికా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ మంత్రి శ్రీధర్‌బాబుతో కాగ్నిజెంట్ సీఈవో రవికుమార్, కంపెనీ ప్రతినిధులతో సమావేశమయ్యారు. కాగ్నిజెంట్ సీఈవోతో సీఎం రేవంత్ బృందం బ్రేక్ ఫాస్ట్ భేటీలో పాల్గొంది. ఈ మీటింగ్‌లోనే.. కాగ్నిజెంట్ విస్తరణ ఒప్పందం కుదిరింది. హైదరాబాద్ సహా తెలంగాణ వ్యాప్తంగా ఐటీ రంగానికి మరింత అనుకూలమైన వాతావరణం కల్పించేందుకు ప్రజా ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. కాగ్నిజెంట్ కొత్త సెంటర్ ఏర్పాటుతో ప్రపంచ టెక్నాలజీ కంపెనీలన్నీ హైదరాబాద్‌ను తమ ప్రధాన గమ్యస్థానంగా ఎంచుకుంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కాగ్నిజెంట్ కంపెనీకి అవసరమైన సహకారం అందిస్తామని.. కొత్త సెంటర్ ఏర్పాటుతో వేలాది మంది యువతకు ఉద్యోగాలతో పాటు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై సానుకూల ప్రభావం ఉంటుందన్నారు సీఎం రేవంత్‌రెడ్డి. అటు.. టెక్నాలజీ, ఇన్నోవేషన్ హబ్‌గా సత్తా చాటుకుంటున్న హైదరాబాద్‌లో తమ కంపెనీ విస్తరించటం సంతోషంగా ఉందన్నారు కాగ్నిజెంట్ సీఈవో రవికుమార్. హైదరాబాద్‌లో నెలకొల్పే కాగ్నిజెంట్ కొత్త సెంటర్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ క్లయింట్‌లకు మెరుగైన సేవలందించేందుకు ఉపయోగపడుతుందని తెలిపారు.
ఇక.. మూడో రోజు పర్యటనలో రోజంతా పెట్టుబడులు, ఒప్పందాలపైనే ఫోకస్ పెట్టారు సీఎం రేవంత్‌రెడ్డి. ఈ క్రమంలోనే.. పలు సంస్థలతో MOUలు చేసుకున్నారు. కాగ్నిజెంట్ డీల్ తర్వాత..తెలంగాణ మహిళా పారిశ్రామికవేత్తలకు పెద్ద ప్రోత్సాహకంగా అమెరికాకు చెందిన ప్రముఖ వాల్ష్ కర్రా హోల్డింగ్స్ సంస్థ తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలోని వీ హబ్‌లో 5 మిలియన్ల డాలర్ల పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చింది. సీఎం రేవంత్‌తో సమావేశమైన వాల్స్ కర్ర హోల్డింగ్స్ బృందం.. పెట్టుబడులకు సంబంధించి చర్చించిన తర్వాత ఒప్పందాలపై సంతకాలు చేశారు. రాబోయే ఐదేళ్లలో మరో సుమారు 839 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. అలాగే.. ఇండియా కాన్సులర్ జనరల్‌తో లంచ్ మీట్‌లో పాల్గొన్నారు. లంచ్ తర్వాత మరికొన్ని కంపెనీల ప్రతినిధులతో సమావేశమయ్యారు సీఎం రేవంత్‌రెడ్డి. అంతకుముందు.. ప్రపంచంలోనే అతిపెద్ద స్టాక్ ఎక్సేంజ్‌గా.. అగ్రరాజ్యం అమెరికా ఆర్థిక వ్యవస్థలో అత్యంత కీలకంగా ఉన్న ప్రఖ్యాత న్యూయార్క్ స్టాక్ ఎక్సేంజ్‌ను సీఎం రేవంత్‌రెడ్డి బృందం సందర్శించింది. మొత్తంగా.. తెలంగాణకు పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్ బృందం అమెరికా పర్యటన కొనసాగుతోంది. పలు కంపెనీల ప్రతినిధులతో వరుసగా భేటీ అవుతూ.. పెట్టుబడులపై ఒప్పందాలు చేసుకుంటున్నారు.