సీఎం కేసీఆర్ నేడు పాలమూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 11 గంటలకు సీఎం ప్రగతిభవన్ నుంచి బయలుదేరి రోడ్డు మార్గం ద్వారా 12: 45 కి అక్కడికి చేరుకుంటారు. మధ్యాహ్నం 1.15 నిమిషాలకు ఫారెస్ట్ కాంప్లెక్స్ ఎదురుగా సింధు హోటల్ సమీపంలో నిర్మించిన టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. అనంతరం మధ్యాహ్నం 1.30నిమిషాలకు భూత్పూర్ మార్గంలో నూతనంగా నిర్మించిన సమీకృత జిల్లా కలెక్టరేట్ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు.
ఆ తరువాత లంచ్ ఉంటుంది. భోజనం అనంతరం మధ్యాహ్నం 3.50 నిమిషాలకు జిల్లా అధికారులతో సీఎం సమావేశం అవుతారు. ఆ తరువాత సాయంత్రం 4 గంటలకు ఎంవీఎస్ కళాశాల మైదాన ప్రాంగణంలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో సీఎం పాల్గొని ప్రసంగిస్తారు. సాయంత్రం 5 గంటలకు హెలికాప్టర్ ద్వారా తిరిగి హైదరాబాద్ కు బయలుదేరి ప్రగతిభవన్ కు చేరుకుంటారు.
సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో బందోబస్తు ఏర్పాట్లను శనివారం ఐజీ బి.కమలాసన్ రెడ్డి పరిశీలించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ప్రారంభోత్సవంతో పాటు బహిరంగసభకు సంబంధించిన ఏర్పాట్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అంతకుమందు జిల్లా కేంద్రంలో పోలీస్ ఆఫీసర్లతో సమావేశమై బందోబస్తుపై సూచనలు చేశారు.