రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్ కుమార్‌కు వీఐపీ ట్రీట్మెంట్ ఇచ్చారు ఎస్కార్ట్ పోలీసులు. ఓ మంచి హోటల్‌కు తీసుకెళ్లి.. చికెన్, మటన్‌తో మంచి నాన్ వెజ్ మీల్స్ పెట్టించారు. ఈ వ్యవహారం పోలీస్ పెద్దల దృష్టికి వెళ్లడంతో యాక్షన్‌లోకి దిగారు.
అతనో రౌడీషీటర్.. నోటికి అడ్డూ అదుపు ఉండేది కాదు. బెదిరింపులు, దౌర్జన్యాలతో పేట్రేగిపోయాడు. ఏకంగా ఎమ్మెల్యేలను కూడా ఫోన్లు చేసి బెదిరించేవాడు. అంతేనా.. గతంలో విపక్షంలో ఉన్న చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లను అసభ్య పదజాలంతో దూషించాడు. వారి కుటుంబ సభ్యుల గురించి కూడా తప్పుగా మాట్లాడాడు. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదుగా.. పాపం పండింది. రాష్ట్రంలో గవర్నమెంట్ మారింది. దీంతో పోలీసులు యాక్షన్‌లోకి దిగిపోయారు. పలు కేసుల్లో ముద్దాయిగా ఉన్న బోరుగడ్డ అనిల్‌కుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని కోర్టు ఆదేశాలతో జైలుకు తరలించారు. అయితే జ్యుడిషియల్ రిమాండ్‌లో ఉన్న బోరుగడ్డ అనిల్ కుమార్‌ను మంగళగిరి కోర్టులో హాజరుపరిచేందుకు తీసుకొచ్చిన ఎస్కార్ట్ పోలీసులు.. అతడిని ఓ వీఐపీలా ట్రీట్ చేశారు. లగ్జరీ రెస్టారెంట్‌లో.. పసందైన విందు భోజనం ఏర్పాటు చేశారు. ఈ విషయం స్టేట్ పోలీస్ బాస్‌కు తెలియడంతో.. ఏడుగురు పోలీసులను సస్పెండ్ చేశారు.
అనిల్‌పై తుళ్లూరు పోలీసుస్టేషన్ పరిధిలో గతంలో నమోదైన రెండు కేసులకు సంబంధించి పోలీసులు అతడిని బుధవారం రాజమమండ్రి సెంట్రల్ జైలుకు తీసుకొచ్చి మంగళగిరి కోర్టులో హాజరుపరిచారు. మధ్యాహ్నం 2.30 గంటలకు తిరిగి రాజమండ్రి పయనమయ్యారు. అనిల్‌కు ఎస్కార్ట్ టీమ్‌గా గుంటూరు జిల్లా ఏఆర్‌కు చెందిన RSI పి.నారాయణరెడ్డి నేతృత్వంలో ఏఆర్ హెడ్‌కానిస్టేబుల్ కె.శ్రీనివాసరావు, ఏఆర్ కానిస్టేబుళ్లు టి.శంకరరావు, కె.బుచ్చయ్య.. తాడికొండ పీఎస్ కానిస్టేబుల్ ఎస్.ఏ.సద్దులా… తుళ్లూరు పోలీసుస్టేషన్ కానిస్టేబుళ్లు బాల ఎం.శౌరి, నాగరాజు ఉన్నారు.
రూల్స్ ప్రకారం రిమాండ్ ఖైదీగా ఉన్న అనిల్‌కు. వాహనంలోనే ఉంచి ఆహారం అందివ్వాలి. అయితే వీరు అతడిని వీఐపీలా ట్రీట్ చేశారు. గన్నవరం సమీపంలోని ఓ రెస్టారెంట్ వద్ద వాహనాన్ని ఆపి, అనిల్‌ను దర్జాగా లోపలికి తీసుకెళ్లారు. లోపల మాంచి మాంసాహార భోజనం పెట్టించారు. అతనితో కలిసి ఎంచక్కా లంచ్ చేశారు. బిల్ అనిలే పే చేయడం గమనార్హం. ఈ తతంగాన్ని తమ సెల్‌ఫోన్లలో షూట్ చేస్తోన్న వారిని బెదిరించి, డిలీట్ చేయించారు పోలీసులు. విషయంలో తెలియడంతో.. డీజీపీ ద్వారకా తిరుమలరావు తీవ్రంగా పరిగణించారు. అరగంట వ్యవధిలో సంబంధిత పోలీసులందర్నీ సస్పెండ్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో వారిపై వేటు పడింది.