టీటీడీ పాలకమండలిలో బీజేపీ నేత భానుప్రకాష్‌రెడ్డికి చోటు.. మొత్తం 29 మందితో జీవో విడుదల

టీటీడీ పాలకమండలిలో బీజేపీ నేత భానుప్రకాష్‌రెడ్డికి చోటు.. మొత్తం 29 మందితో జీవో విడుదల

ఇటీవల కొత్తగా ఏర్పాటైన టీటీడీ పాలకమండలిని మరింత విస్తరించింది. బీజేపీ సీనియర్‌ నేత భాను ప్రకాష్‌రెడ్డికి చాన్స్‌ ఇవ్వడంతోపాటు.. నలుగురిని ఎక్స్‌ అఫీషియో సభ్యులుగా చేర్చింది ఏపీ ప్రభుత్వం. టీడీపీ నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలతో పాటు పలువురు నాయకులకు, జనసేన కోటాలో ముగ్గురికి స్థానం దక్కింది.

తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త పాలక మండలిని ఏర్పాటు చేస్తూ ఏపీ ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు విడుదల చేసింది. మూడు రోజుల క్రితం 24 మంది సభ్యులతో పాలక మండలిని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన ప్రభుత్వం.. తిరుపతికి చెందిన సీనియర్‌ బీజేపీ నేత భానుప్రకాష్‌రెడ్డికి పాలక మండలిలో చోటు కల్పించింది. అలాగే.. ఎక్స్‌ అఫీషియో సభ్యులుగా దేవదాయశాఖలోని రెవెన్యూ కార్యదర్శి.. దేవదాయశాఖ కమిషనర్‌, టీటీడీ ఈవో, తుడా చైర్మన్‌ను చేర్చింది. బీఆర్ నాయుడు చైర్మన్‌గా అధికారులతో కలిపి మొత్తం 29 మందితో పాలక మండలిని ఏర్పాటు చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది.

మొత్తం బోర్డులో ఆంధ్రప్రదేశ్‌ తర్వాత తెలంగాణకు ఎక్కువ ప్రాధాన్యం దక్కింది. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన వారికి బోర్టులో స్థానం లభించింది. సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టి్‌స్‌గా పని చేసిన వ్యక్తిని తొలిసారి టీటీడీ బోర్డులో నియమించారు. మాజీ సీజేఐ జస్టిస్‌ హెచ్‌ఎల్‌ దత్తును బోర్డు సభ్యుడిగా నియమించారు. టీడీపీ నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలతో పాటు పలువురు నాయకులకు, జనసేన కోటాలో ముగ్గురికి స్థానం దక్కింది. భానుప్రకాష్‌రెడ్డికి చాన్స్‌ ఇవ్వడంతో బీజేపీ నుంచి ఒకరికి అవకాశం దక్కినట్లు అయింది.

అలాగే.. ముగ్గురు మహిళలకు అవకాశం లభించింది. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులుగా నియమించడంపై పలువురు సభ్యులు స్పందించారు. ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి చంద్రబాబుకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. టీటీడీ బోర్డు ద్వారా వెంకన్న భక్తులకు మరింత ఉన్నత సేవలు అందించడానికి కృషి చేస్తామన్నారు. ప్రతి భక్తుడికి వెంకన్న సులభ దర్శనం జరిగేలాగా బోర్డు ద్వారా చర్యలు చేపడతామని వెల్లడించారు టీటీడీ పాలకమండలి సభ్యులు. అంతేకాదు.. గతంలో టీటీడీ పాలకమండలిలో సభ్యులుగా ఉన్నవారికి మరోసారి స్థానం దక్కింది.

Please follow and like us:
ఆంధ్రప్రదేశ్ వార్తలు