ఏపీలో వరుసగా వందేభారత్ రైళ్లు పట్టాలెక్కనున్నాయి. ఇప్పటికే సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య రెండు, విజయవాడ-చెన్నై, సికింద్రాబాద్-తిరుపతి రూట్లలో మొత్తంగా నాలుగు ట్రైన్స్ తిరుగుతుండగా.. ఇప్పుడు మరో వందేభారత్ రైలు ఏపీలో పట్టాలెక్కనుందని సమాచారం. విశాఖపట్నం నుంచి ఒడిశాలోని దుర్గ్‌కు ఈ వందేభారత్ రైలు పరుగులు పెట్టనుందట. ఇప్పటికే విశాఖ నుంచి రెండు వందేభారత్ రైళ్లు నడుస్తున్నాయి. దీంతో కలిపి ఆ సంఖ్య మూడుకు చేరనుంది. వాల్తేరు డివిజన్ నుంచి దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రానప్పటికీ.. దుర్గ్-విశాఖపట్నం-దుర్గ్ మధ్య వందేభారత్ రైలు నడిపేందుకు మాత్రమే ఒడిశా ప్రభుత్వం చర్యలు చేపట్టినట్టు తెలిసింది.
దుర్గ్-విశాఖపట్నం(20829) వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ఉదయం 6 గంటలకు దుర్గ్‌లో బయల్దేరి మధ్యాహ్నం 1.55 గంటలకు వైజాగ్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో విశాఖపట్నం-దుర్గ్(20830) వందేభారత్ రైలు మధ్యాహ్నం 2.50 గంటలకు బయల్దేరి రాత్రి 10.50 గంటలకు దుర్గ్‌కు వెళ్తుందని తెలుస్తోంది. మరోవైపు విజయవాడ నుంచి బెంగళూరు మధ్య వందేభారత్ రైలు నడిపే అంశంపై కేంద్ర రైల్వేశాఖ సమీక్ష జరుపుతోందని సమాచారం. ఇక ఇప్పటికే సికింద్రాబాద్-యశ్వంత్‌పూర్ మధ్య వందేభారత్ పరుగులు పెడుతోన్న విషయం తెలిసిందే. అటు సికింద్రాబాద్-పూణే మధ్య వందేభారత్ స్లీపర్ రైలు ప్రారంభించాలనే నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే శాఖ వెల్లడించింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో వందేభారత్ రైళ్లకు ప్రజాదరణ విపరీతంగా పెరిగిందని చెప్పాలి.