ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల కోసం మరోసారి కీలక పథకాన్ని అమలుకు సిద్ధమైంది. గతంలో అమలు చేసిన సూక్ష్మసేద్య పథకాన్ని తీసుకొస్తోంది.
ప్రధానాంశాలు:
ఏపీలో రైతులకు ప్రభుత్వం శుభవార్త
మళ్లీ డ్రిప్ ఇరిగేషన్ పథకం అమలు
ఈ ఏడాది 7.5 లక్షల ఎకరాలకు పెంపు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు తీపికబురు చెప్పింది. అన్నదాతల కోసం.. వారి నుంచి వినతులు రావడంతో డ్రిప్ ఇరిగేషన్ (సూక్ష్మసేద్య పథకం) మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రైతు తన వాటా మొత్తం చెల్లిస్తే.. వెంటనే పరికరాలు బిగించేలా కొత్త పథకాన్ని నేటి నుంచి నుంచే అమలు చేస్తున్నారు. రాష్ట్రంలో ఉద్యాన రంగాన్ని ప్రోత్సహించే క్రమంలో.. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో సూక్ష్మసేద్యం అమలుపై ఫోకస్ పెట్టింది. అవసరం ఉన్న ప్రతి రైతుకూ ఈ పథకాన్ని వర్తింపజేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. రాయలసీమ ప్రాంతంలో రైతులకు ఈ పథకం ఎంతో మేలు చేస్తుందని చెబుతున్నారు.
వాస్తవానికి ఈ ఏడాది 2.50 లక్షల ఎకరాల్లో సూక్ష్మసేద్యం అమలుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో దాన్ని 7.50 లక్షల ఎకరాలకు పెంచారు. 33 కంపెనీల ప్రతినిధులతో పరికరాలు సమకూర్చేందుకు ఇటీవల సమావేశం అయ్యారు. గత ప్రభుత్వం చెల్లించాల్సిన రూ.1,167 కోట్ల బకాయిల గురించి ఆ సంస్థల ప్రతినిధులు ప్రశ్నించగా.. ఇప్పటికే రూ.175 కోట్లు ఇచ్చామని అధికారులు గుర్తు చేశారు. ఇక మిగిలిన మొత్తాన్ని విడతల వారీగా విడుదల చేస్తామని హామీ ఇవ్వగా.. సీఎంపై తమకు నమ్మకముందంటూ వారు కొత్తగా మరిన్ని యూనిట్ల ఏర్పాటు చేసేందుకు ఓకే చెప్పారు.
మరోవైపు పింఛన్ల పంపిణీపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందించారు. ‘1వ తేదీనే ఇంటి వద్ద రూ. 2737 కోట్లతో 64 లక్షల మందికి పెంచిన పింఛన్ల పంపిణీ ఎంతో సంతృప్తినిచ్చింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక్క రోజులో రికార్డు స్థాయిలో 97.54 శాతం పింఛన్లు అందించాం. వృద్దులు, దివ్యాంగులు, ఇతర లబ్దిదారుల ఆర్థిక భద్రత మా బాధ్యత. పెరిగిన పింఛను ఆ పేదల జీవితాలకు భరోసా కల్పిస్తుంది. ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయిన ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులకు అందరికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నాం’ అన్నారు.
‘ప్రభుత్వ ఉద్యోగులు అంటే…ప్రభుత్వంలో భాగం. ప్రజలకు ఏ మంచి చెయ్యాలన్నా వారే కీలకం. అలాంటి వర్గానికి కూడా 1వ తేదీనే జీతాలు అందజేశాం. రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్ చెల్లించాం. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా…. అనేక సమస్యలు ఉన్నా రూ. 5300 కోట్లు విడుదల చేసి వారికి దక్కాల్సిన జీతం 1తేదీనే చెల్లించాం. రాష్ట్ర పునర్నిర్మాణ కార్యక్రమంలో ఉద్యోగులు, అధికారుల పాత్ర ఎంతో కీలకం. ఉద్యోగులతో పని చేయించుకోవడమే కాదు వారి సంక్షేమం చూసే, గౌరవం ఇచ్చే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. కలిసి కష్టపడదాం… రాష్ట్ర భవిష్యత్తును మారుద్దాం అని పిలుపునిస్తున్నా’ అంటూ ట్వీట్ చేశారు. చంద్రబాబు మడకశిర నియోజకవర్గంలో కూడా ఈ డ్రిప్ పథకం గురించి రైతు దగ్గర ప్రస్తావనకు వచ్చింది.