ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కూటమి ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేసిన ఉచిత ఇసుక పథకంలో మరికొన్ని మార్పులు చేసింది. మొన్నటి వరకు కేవలం ఎడ్ల బండ్లలో మాత్రమే ఇసుకను తరలించే అవకాశం ఉండగా తాజాగా.. ఈ అవకాశాన్ని ట్రాక్టర్లకు కూడా కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది…
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొన్ని రోజులకే అమలు చేసిన పథకాల్లో ఉచిత ఇసుక ఒకటి. స్థానిక అవసరాలకు రీచ్‌ల నుంచి ఉచితంగా ఇసుక తీసుకెళ్లేలా ప్రభుత్వం అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఇందుకు సంబంధించి ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై స్థానిక అవసరాలకు ఇసుకను తీసుకెళ్లేందుకు ట్రాక్టర్లకు సైతం అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
మొన్నటి వరకు కేవలం ఎడ్డ బండ్లకు మాత్రమే అవాకశం ఉండేది. అయితే తాజాగా తీసుకున్న నిర్ణయంతో ట్రాక్టర్లలో కూడా ఇసుకను తీసుకెళ్లే అవకాశం కల్పించారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే గనుల శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా ఉత్తర్వులు జారీ చేశారు. అయితే కేవలం స్థానిక అవసరాల కోసం మాత్రమే ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఉత్వర్వుల్లో స్పష్టం చేశారు.
ఇందులో భాగంగానే.. ఇసుక పాలసీలో సవరణ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రజలకు ఇసుక కొరత ఉండకూడదనే ఉద్దేశంతో ట్రాక్టర్లకు కూడా అనుమతులు ఇచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. ఇకపై రాష్ట్రంలో ఇసుక అందుబాటులో లేదన్న కారణంతో ఇళ్ల నిర్మాణాలు ఆగిపోకూడదని ప్రభుత్వం చెబుతోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో నిర్మాణ పనులకు ఇసుక కొరత లేకుండా ఉండేందుకే రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ముఖేష్ కుమార్ మీనా ఉత్తర్వుల్లో తెలిపారు.
గ్రామాల్లో అవసరాలకు సరిపడేంత మోతాదులో ఇసుక రవాణాకు అనుమతించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. గ్రామాల్లో నిర్మాణాలకు ఆటంకం లేకుండా స్థానిక అవసరాలకు సమీపంలోని వాగుల నుంచి ఇసుకను ఉచితంగా తీసుకెళ్లవచ్చని, అవసరమైనవారు ట్రాక్టర్లు, ఎడ్ల బండ్లలోనూ రవాణా చేసుకోవచ్చని గనుల శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు.