అభిమాని హత్య కేసులో దర్శన్‌కు ఉచ్చు బిగుస్తోంది. ఫోరెన్సిక్ నివేదికతో ఈ కేసు దర్యాప్తు మరింత స్పీడ్‌గా సాగనుంది. ఇంటి భోజనం కోసం దర్శన్ హైకోర్టును ఆశ్రయించగా.. తీర్పుపై ఉత్కంఠ నెలకొంది.
అభిమాని రేణుకా స్వామి హత్య కేసులో జైల్లో ఉన్న కన్నడ నటుడు దర్శన్, ప్రియురాలు పవిత్రగౌడ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఈ కేసులో ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ పోలీసులకు అందింది. దర్శన్ దుస్తులపై ఉన్న రక్తపు మరకలు రేణుకాస్వామిదేనని నిర్ధారణ అయింది. ఫోరెన్సిక్ నివేదికతో ఈ కేసు దర్యాప్తు మరింత స్పీడ్‌గా సాగనుంది.
మరోవైపు ఇంటి భోజనం కోసం దర్శన్ హైకోర్టును ఆశ్రయించారు. అయితే నివేదిక సమర్పించాలని జైలు అధికారులను కోర్టు ఆదేశించింది. ఇంటి భోజనం అవసరం లేదని.. దర్శన్ ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని.. హత్య కేసులో నిందితుడికి ఇంటి భోజనం, ఇతర సౌకర్యాలు కల్పించలేమని జైలు అధికారులు కోర్టుకు నివేదిక సమర్పించేందుకు సిద్ధమవుతున్నారు. గత నెల రోజులుగా ఈ కేసు సాగుతుండగా.. తదుపరి విచారణ 20వ తేదీకి వాయిదా పడింది.
ఇక ఈ హత్య కేసులో ఏ1గా ఉన్న పవిత్రగౌడ ఏటా వరలక్ష్మి వేడుకలను ఘనంగా జరుపుకుంటారు. అయితే పవిత్రగౌడ పరప్పన అగ్రహార జైలులో ఉండడంతో తనకు బెయిల్ వస్తుందో.. లేదోనని ఆందోళన చెందుతున్నారు.
బెంగళూరులో చిత్రదుర్గకు చెందిన రేణుకా స్వామిని దర్శన్, పవిత్రగౌడ హత్య చేశారనే ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం దర్శన్, పవిత్ర గౌడతో సహా మరో 16 మంది జైల్లో ఉన్నారు. కోర్టులో విచారణ ప్రారంభమైతే, రెండు మూడు వాయిదాల్లోనే దర్శన్, పవిత్రగౌడ, ఇతర నిందితులకు శిక్షను ఖరారు చేసే అవకాశం ఉందని చెప్తున్నారు.