ఇవాళ దేశం మొత్తం ఎన్నికల ఫలితాల గురించే చర్చ నడుస్తోంది. టీవీ ఆన్ చేస్తే కౌంటింగ్ అప్డేట్, ప్రత్యేక కథనాలు, విశ్లేషణలు, చర్చలు.. ఆఖరికి సోషల్ మీడియాలో నవ్వులు పంచే మీమ్స్ సైతం ఎన్నికల రిజల్ట్స్ గురించే ఉంటున్నాయి. ఈ తరుణంలో ట్రెండింగ్లో ఎన్నికల ఫలితాల హవా కొనసాగుతోంది.
ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనేది పక్కన పెడితే ఆయా పార్టీలు, పార్టీల సానుభూతిపరులు సోషల్ మీడియాలో చెలరేగిపోతున్నారు. దీంతో.. ఆయా హ్యాష్ట్యాగ్లు ట్రెండింగ్లో నడుస్తున్నాయి. అయితే 542 లోక్సభ స్థానాల కంటే కూడా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల గురించి ఎక్కువ హ్యాష్ ట్యాగులు సోషల్ మీడియాలో నడుస్తుండడం గమనార్హం.
ఏపీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ బిగ్ విక్టరీ, వైఎస్ జగన్ అగెయిన్, ఏపీ ఎన్నికల ఫలితాలు, పిఠాపురంలో పవన్ భవితవ్యం ఏంటి?, ఏపీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి?, కూటమికి వచ్చే సీట్లు ఎన్ని? టీడీపీ అధినేత చంద్రబాబు తనయుడు నారా లోకేష్ ఈసారైనా గెలుస్తారా?.. ఇలా రకరకాల హ్యాష్ ట్యాగ్లు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి.
ఎన్డీయే-ఇండియా కూటమి గెలుపోటములు, ఒడిషా ఫలితం, దేశవ్యాప్తంగా పాతిక అసెంబ్లీ ఉప ఎన్నికల ఫలితాలు అన్నీ ఒక ఎత్తు అయితే.. కేవలం ఏపీ సార్వత్రిక ఎన్నికల ఫలితంపై సోషల్ మీడియాలో కొనసాగుతున్న ట్రెండ్ ఆ ప్రత్యేకతను చెప్పకనే చెబుతోంది.