జైలులో ఖైదీ మృతి చెందగా, కోర్టు తీర్పుతో ఆ కుటుంబానికి ఊరట లభించింది. బాధిత కుటుంబానికి రూ.6.20 లక్షల పరిహారాన్ని చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. 2012, జూలై 4 నుంచి 3 శాతం వడ్డీతో కలిపి ఆర్డర్ ఇచ్చిన మూడు నెలల్లో అందజేయాలని తేల్చిచెప్పింది. కేసు వివరాల్లోకి వెళితే.. ఓ కేసులో ఐపీసీ 302 కింద నేరం రుజువు కావడంతో మెదక్ జిల్లా టేక్మాల్ మండలం కుసంగి గ్రామానికి చెందిన కె.వెంకయ్యకు ట్రయల్‌కోర్టు జీవితఖైదు విధించింది.
చర్లపల్లి జైలులో ఉంటున్న వెంకయ్యపై 2012, జూలై 4న మరో ఖైదీ డి.నర్సింహులు కత్తెరతో దాడి చేశాడు. గాయపడిన వెంకయ్యను గాంధీ ఆస్పత్రికి తరలించగా, అదే రోజు మృతి చెందాడు. జైలు అధికారుల నిర్లక్ష్యం కారణంగానే తన భర్త మృతి చెందాడంటూ భార్య జయమ్మ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనికి బాధ్యత వహిస్తూ ప్రభుత్వం పరిహారం చెల్లించాలని కోరినా.. అందుకు నిరాకరించిందని పేర్కొన్నారు. దీంతో విధిలేక హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని, రూ.10 లక్షలు చెల్లించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ సీవీ భాస్కర్‌రెడ్డి విచారణ చేపట్టారు.
పిటిషనర్ న్యాయవాది పల్లె శ్రీహరినాథ్ వాదనలు వినిపిస్తూ జైలు అధికారుల బాధ్యతారాహిత్యమే వెంకయ్య మృతికి కారణమన్నారు. జైలు అధికారులు నిబంధన మేరకే వ్యవహరించారని, ఇందులో వారి నిర్లక్ష్యం ఏమీ లేదని హోంశాఖ తరఫున జీపీ వాదనలు వినిపించారు. వాదనలు విన్న న్యాయమూర్తి మృతిచెందే నాటికి 55 ఏళ్ల వెంకయ్య నెలకు రూ.7,200 సంపాదిస్తున్నారని, సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం.. లెక్కగట్టి రూ.6,33,600 అవుతుందని పేర్కొన్నారు. ఇతర ఖర్చులన్నీ కలిపి రూ.7.2 లక్షల అవుతుందని లెక్కించారు. అయితే జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆదేశాల మేరకు 2018లో రూ.లక్ష చెల్లించినందున మిగిలిన రూ.6.2 లక్షల అందజేయాలని ఆదేశించారు.
.