మహేష్ బాబు – త్రివిక్రమ్.. ఈ కాంబో కోసం ఇద్దరి అభిమానులు ఎదురుచూస్తూ ఉంటారు. గతంలో ఈ ఇద్దరూ కలిసినప్పుడు మంచి సినిమాలే వచ్చినా.. ఒక దానికి లాభాలు రాలేదు. రెండో సినిమాకు పేరొచ్చినా.. డబ్బులు రాలేదు. దీంతో మూడో సినిమా ఎప్పుడా? అని ఎదురు చూస్తూ ఉన్నారు. ఇలాంటి సమయంలో #SSMB28 అంటూ కొన్ని నెలల క్రితం హారిక హాసిని క్రియేషన్స్ అనౌన్స్ చేయగానే.. ‘హమ్మయ్య మన కోరిక నెరవేరుతోంది’ అంటూ అభిమానులు ఆనందపడ్డారు. అయితే సినిమాకు బాలారిష్టాలు తప్పడం లేదు.
సినిమా అనుకున్నది ఆలస్యం.. ఏదో ఒకటి అడ్డు తగులుతూనే ఉంది. సినిమా కథ ఓకే కాక కొన్ని రోజులు, ‘సర్కారు వారి పాట’ షూటింగ్ పూర్తి కాక కొన్ని రోజులు, ఆ తర్వాత మహేష్ మాతృమూర్తి ఇందిర కన్నుమూయడంతో కొన్ని రోజులు, ఆ తర్వాత కథ నచ్చక ఇంకొన్ని రోజులు, మధ్యలో మహేష్ ఫ్యామిలీ ట్రిప్స్.. ఇలా సినిమా ఆలస్యమవుతూ వచ్చింది. ఎట్టకేలకు ఆ మధ్య షూట్ మొదలుపెట్టారు. అయితే ఒక్క షెడ్యూల్‌కే ఆగిపోయింది. మళ్లీ మొదలు అనుకునేసరికి సూపర్ స్టార్ కృష్ణ కన్నుమూశారు. దీంతో మళ్లీ హాల్ట్.
ఇప్పుడు ఈ లెక్కలు ఎందుకు అనుకుంటున్నారా? ఎందుకంటే ఈ సినిమా కోసం ఇప్పటికే నిర్మాతకు రూ. 10 కోట్లకుపైగా లాస్ అంటున్నారు కాబట్టి. అవును సినిమా మొదలవ్వకముందే టీమ్‌కి రూ. పది కోట్లు నష్టమట. ముందు చెప్పినట్లు ఆ మధ్య షెడ్యూల్ మొదలెట్టి, ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ తీశారు. దాని కోసం ఏకంగా రూ.10 కోట్లు ఖర్చు పెట్టారట. అయితే ఇప్పుడు అనూహ్యంగా ఆ మొత్తం సీన్స్‌ని పక్కన పెట్టేయాలని అని మహేష్‌బాబు అంటున్నారట. దీంతో ఆ డబ్బులు ఫైట్‌లో పోసిన పన్నీరే అంటున్నారు.
దీనికి కారణం ఆ సీన్స్ తీసినప్పుడు అనుకున్న కథ.. ఇప్పుడు లేదంట. దీంతో ఆ సీన్స్ ఈ సినిమాకు ఉపయోగపడవు అంటున్నారు. పాత కథని పక్కన పెట్టి, త్రివిక్రమ్ తాజాగా కొత్త కథ రాసుకొన్నారట. అలా సినిమా మొదలవ్వకముందే రూ.పది కోట్ల నష్టం వచ్చినట్టు తేలింది. త్వరలో షూటింగ్ ప్రారంభం అని చెబుతున్నా.. వచ్చే జనవరిలోనే ఉండొచ్చు అంటున్నారు. ప్రస్తుతానికైతే దుబాయ్‌లో మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయట. మహేష్, త్రివిక్రమ్, తమన్ ఈ సిట్టింగ్స్‌లో ఉన్నారట. గతంలో సినిమాలు పూర్తయ్యాక లాభాలు రాలేదు.. ఇప్పుడు షూటింగ్ పూర్తవ్వకుండానే నష్టం. ఏంటో ఈ కాంబో.