ఫిఫా వరల్డ్ కప్ 2022లో అర్జెంటీనా అదుర్స్ అనిపించింది. పోలాండ్‌తో జరిగిన పోరులో 2–0తో గెలిచి నాకౌట్‌కు చేరుకుంది. హాట్ హాట్ సాగిన మొదటి అర్థభాగంలో గోల్ కొట్టేందుకు రెండు జట్లు తీవ్రంగా కృషి చేశాయి. కానీ గోల్ కొట్టలేకపోయాయి. రెండో అర్థభాగంలో దూకుడుగా ఆడిన అర్జెంటీనా రెండు గోల్స్ చేసి విజేతగా నిలిచింది. రౌండ్ 16లో భాగంగా అర్జెంటీనా తర్వాతి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో తలపడనుంది.
గెలిచి నిలిచే…
నాకౌట్ చేరాలంటే ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో అర్జెంటీనా అదరగొట్టింది. గ్రూప్ Cలో భాగంగా పొలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో అర్జెంటీనా 2–0తో పోలాండ్‌ను ఓడించి రౌండ్ 16 కు చేరుకుంది. రెండు జట్లు నువ్వా నేనా అన్నట్లు తలపడటంతో…ఫస్టాఫ్‌లో ఒక్క గోల్ కూడా కొట్టలేకపోయాయి. అయితే సెకండాఫ్‌లో అర్జెంటీనా రెండు గోల్స్ సాధించింది. 46వ నిమిషంలో అలెక్స్ మాక్ అలిస్టర్ గోల్ చేసి జట్టుకు 1–0తో ఆధిక్యం అందించాడు. ఆ తర్వాత 67వ నిమిషంలో జులియన్ అల్వరెజ్ మరో గోల్ కొట్టడంతో…అర్జెంటీనా ఆధిక్యం 2–0కు పెరిగింది. ఈ ఆధిక్యాన్ని అర్జెంటీనా చివరివరకూ కాపాడుకుంది.
మెస్సీ రికార్డు..
అర్జెంటీనా చేతిలో పోలాండ్ ఓడిపోయినా..నాకౌట్‌కు చేరుకుంది. గ్రూప్C లోనే ఉన్న సౌదీ అరేబియా, మెక్సికో కంటే పోలాండ్ గోల్స్ ఎక్కువ ఉండటంతో ఆ జట్టు రౌండ్ 16లో అడుగుపెట్టింది. ఈ మ్యాచ్‌తో మెస్సీ అరుదైన రికార్డ్ సృష్టి్ంచాడు. అర్జెంటీనా తరఫున అత్యధిక ప్రపంచకప్ మ్యాచ్‌లు ఆడిన ప్లేయర్‌గా నిలిచాడు. ఇదే క్రమంలో డిగో మారోడానా పేరును ఉన్న రికార్డును మెస్సీ బద్దలు కొట్టాడు. లియోనల్ మెస్సీకి ఇది 999వ మ్యాచ్. ఫిఫా వరల్డ్‌కప్ టోర్నీలో 22వది కావడం విశేషం.