పదో తరగతి విద్యార్ధులకు అలర్ట్‌.. మార్చి 15 నుంచి టెన్త్‌ పబ్లిక్‌ పరీక్షలు! త్వరలో టైం టేబుల్ విడుదల

పదో తరగతి విద్యార్ధులకు అలర్ట్‌.. మార్చి 15 నుంచి టెన్త్‌ పబ్లిక్‌ పరీక్షలు! త్వరలో టైం టేబుల్ విడుదల

పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు సంబంధించి పాఠశాల విద్యాశాలక కీలక అప్ డేట్ ఇచ్చింది. పరీక్షలకు సన్నద్ధం చేయడానికి వంద రోజుల యాక్షన్ ప్లాన్ ను విడుదల చేసింది. అంతేకాకుండా పబ్లిక్ పరీక్షల టైం టైబుల్ ను కూడా రూపొందించింది..

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో 2024-25 విద్యాసంవత్సరానికి సంబంధించి వచ్చే ఏడాది మార్చిలో పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు జరగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పరీక్ష ఫీజు చెల్లింపుల ప్రక్రియ కూడా ప్రారంభమైంది. డిసెంబర్ నెలాఖరు వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. అయితే టెన్త్‌ పబ్లిక్‌ పరీక్షలను మార్చి 15వ తేదీ నుంచి నిర్వహించాలని పాఠశాల విద్యా శాఖ భావిస్తున్నట్లు తెలుస్తుంది. మార్చి నెలాఖరుకల్లా పరీక్షలను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మేరకు పరీక్షల టైమ్‌ టేబుల్‌ను రూపొందించి, ప్రభుత్వ పరిశీలనకు పంపించినట్టు సమాచారం. ఈ క్రమంలో ఇతర పరీక్షల షెడ్యూళ్లు కూడా పరిగణనలోకి తీసుకుని, పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ను ఖరారు చేసే అవకాశం ఉంది.

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులను పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలకు సన్నద్ధం చేసేందుకని పాఠశాల విద్యా శాఖ 100 రోజుల యాక్షన్‌ ప్లాన్‌ను సోమవారం విడుదల చేసింది. టైమ్‌ టేబుల్‌తో కూడిన ప్రణాళికను పాఠశాల విద్య డైరెక్టర్‌ విజయ్‌ రామరాజు రాష్ట్రంలోని అన్ని మెనేజ్‌మెంట్లలోని ఉన్నత పాఠశాలలకు పంపించారు. దీని ప్రకారం ప్రతిరోజూ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆరు సెషన్లలో పదో తరగతి విద్యార్ధులకు తరగతులు నిర్వహించనున్నారు. ఈ మేరకు డిసెంబర్‌ ఒకటో తేదీ నుంచి మార్చి 10వ తేదీ వరకు యాక్షన్‌ ప్లాన్‌ అమలు చేయాలని విద్యాశాఖ ఆయా పాఠశాలలను ఆదేశించింది.

విద్యార్థులు పరీక్షలంటే భయపడకుండా స్లిప్‌ టెస్టులు నిర్వహించాలని, చదువులో వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించి వారిని కూడా మెరుగ్గా సన్నద్ధం చేయాలని సూచించారు. దీనిలో భాగంగా ఆదివారాలతో పాటు సెలవు దినాల్లోనూ స్పెషల్‌ క్లాసులు నిర్వహించాలని విద్యాశాఖ ఆదేశించింది. తరగతుల అనంతరం విద్యార్థులను సురక్షితంగా ఇంటికి పంపే వరకు ఉపాధ్యాయుల పర్యవేక్షణ ఉండాలని పేర్కొంది. ఈ మేరకు డిసెంబర్‌ 7న పేరెంట్స్‌-టీచర్స్‌ సమావేశం నిర్వహించి, దీనిపై చర్చించాలని సూచించింది.

Please follow and like us:
ఆంధ్రప్రదేశ్ వార్తలు