ఊపిరి తీస్తోన్న గాలి.. గత 10 ఏళ్లలో ఏకంగా 6వేల మంది.. భయపెడుతోన్న లెక్కలు

ఊపిరి తీస్తోన్న గాలి.. గత 10 ఏళ్లలో ఏకంగా 6వేల మంది.. భయపెడుతోన్న లెక్కలు

నగరంలో పొల్యూషన్‌ ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. ప్రముఖ ఆరోగ్య సంస్థ వెల్లడించిన లెక్కలు ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇప్పటికే 6వేల మంది చనిపోయారు. ఈ గణాంకాలతో ప్రజలు గాలి పీల్చాలంటే ఆలోచించే పరిస్థితి ఏర్పడింది.

మహానగరంలో పొల్యూషన్‌తో మానవ మనుగడకు ప్రమాదం పొంచి ఉంది. నగరంలో పెరుగుతున్న జనాభా దృష్ట్యా రోజురోజుకు వాహనాలు పెరుగుతున్నాయి. దీంతో పొల్యూషన్‌ అత్యధిక స్థాయిలో రికార్డు అవుతోంది. మరీ ముఖ్యంగా సెకండ్‌ హ్యాండ్‌ వాహనాలు, డీజిల్ వాహనాల ద్వారా ఎక్కువగా కాలుష్యం నమోదవుతోంది. పొల్యూషన్‌ కారణంగా శ్వాసకోస ఇబ్బందులతో మృతుల సంఖ్య నానాటికి పెరుగుతోంది. నగరంలో వాయు కాలుష్యం కారణంగా గత 10 ఏళ్లలో 6వేల మందికి పైగా చనిపోయారని గణాంకాలు చెబుతున్నాయి. రీసెంట్‌గా ప్రముఖ ఆరోగ్య జర్నల్ ది లాన్సెట్ ప్లానెట్ విడుదల చేసిన రిపోర్ట్ ప్రజలను ఆదోంళనకు గురిచేస్తోంది. లాస్ట్‌ ఇయర్‌ 2023లోనే కాలుష్యంతో 1,597మంది మరణించినట్లు లాన్సెట్‌ లెక్కలు చెబుతున్నాయి.

తెలంగాణలో రవాణా శాఖ లెక్కల ప్రకారం 2024 మే 31 నాటికి మొత్తం వాహనాలు ఒక కోటి 65 లక్షల 65 వేల 130 వాహనాలు ఉన్నట్లు రవాణాశాఖ చెబుతోంది. ఒక్క గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోనే సుమారు 80 లక్షలకు పైన వాహనాలు తిరుగుతున్నట్లు అధికారుల లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. వాటి నుంచి రోజుకు 1500 టన్నులకు పైగా కాలుష్యకారకాలు విడుదలవుతున్నాయని సంబంధిత అధికారులు వెల్లడించారు. దీంతో చర్యలు చేపట్టింది ప్రభుత్వం.

కాలుష్యాన్ని నియంత్రించేందుకు 15 ఏళ్లు దాటిన వాహనాలను స్వచ్ఛందంగా స్క్రాప్‌కు తరలించాలని సూచిస్తున్నారు రవాణా శాఖ అధికారులు. హైదరాబాద్‌ నగరంలో ఢిల్లీ తరహా కాలుష్య పరిస్థితులు రావొద్దనే ముందస్తు చర్యలు చేపడుతున్నారు. భవిష్యత్తు తరాల దృష్ట్యా ఈవీ కొత్త పాలసీని తీసుకొచ్చింది ప్రభుత్వం. అత్యధిక స్థాయిలో ఈవీ రాయితీ ఇస్తోంది. రోడ్డు, రిజిస్ట్రేషన్ ట్యాక్స్ లో 100శాతం మినహాయింపులు ప్రకటించింది. అంతేకాకుండా చార్జింగ్ స్టేషన్లు మెరుగుపరచడానికి చర్యలకు చేపట్టింది. రాష్ట్రంలో కొత్తగా 6వేల ఎలక్ట్రిక్‌ వాహన చార్జింగ్‌ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు. ఈ దిశగా తెలంగాణ రెడ్‌కో కసరత్తు వేగవంతం చేసింది. ప్రభుత్వ చర్యలతో రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడకం పెరుగుతోంది. దాదాపుగా ఇప్పటివరకు 1 లక్షా70వేల ఎలక్ట్రిక్ వాహనాలు రిజిస్ట్రేషన్ పూర్తయ్యాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఎక్కువగా టూ, త్రీ, ఫోర్ వీలర్ ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలు చేసేందుకు ప్రజలు ఇంట్రెస్ట్ చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలాగే కొనసాగితే రాష్ట్రంలో.. హైదరాబాద్లో వాయు కాలుష్యం కొంత మేర తగ్గించవచ్చని అధికారులు భావిస్తున్నారు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కొత్తగా వెహికల్ కొనాలని ఆలోచన ఉన్నవారు ఈవీ వైపు మోగ్గుచూపాలని సూచిస్తున్నారు అధికారులు.

Please follow and like us:
తెలంగాణ వార్తలు