శ్రీవాణి ట్రస్ట్ కొనసాగింపు విషయంలో నెలకొన్న సందిగ్ధతకు తెరపడుతుందా?. శ్రీవాణి ట్రస్ట్ పై వచ్చిన ఆరోపణలతో టీటీడీ బోర్డు ఎలాంటి నిర్ణయం తీసుకోనుంది. శ్రీవాణి ట్రస్ట్ కొనసాగించలనే పలువురు భక్తుల అభిప్రాయాలను బోర్డు పరిగణనలోకి తీసుకుంటుందా?. కొత్త పాలక మండలి ఏర్పాడిన తర్వాత నిర్వహిస్తున్న తొలి మీటింగ్‌లో ఎలాంటి నిర్ణయాలు ఉండబోతున్నాయి?.
తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. గతంలో టీటీడీలో పాలన గాడి తప్పిందన్న ఆరోపణలతో ప్రక్షాళనకు శ్రీకారం చుడుతోంది. శ్రీవాణి ట్రస్ట్ ద్వారా గత 5 ఏళ్లలో 1450 కోట్ల మేర ఆదాయం వచ్చింది. ముఖ్యంగా శ్రీవాణి ట్రస్టు విషయంలో గత ప్రభుత్వం అక్రమాలకు పాల్పడిందనే ఆరోపణల నేపథ్యంలో టీటీడీ కొత్త పాలక మండలి సుదీర్ఘంగా చర్చించనుంది. టీటీడీ చైర్మన్, ఈవో అధ్యక్షతన టీటీడీ బోర్డు భేటీ కానుంది. ఈభేటీలో పలు విషయాలతో పాటు శ్రీవాణి ట్రస్టును కొనసాగించాలా? లేదా అనేది ప్రధానంగా చర్చించనున్నారు. అయితే చైర్మన్‌గా తన పేరు ప్రకటించిన వెంటనే మీడియాతో మాట్లాడిన బీఆర్ నాయుడు.. శ్రీవాణి ట్రస్ట్ విషయంలో కీలక కామెంట్స్ చేశారు. శ్రీవాణి ట్రస్ట్ రద్దు చేసేలా నిర్ణయం తీసుకుంటామని ఇప్పటికే ప్రకటించారు.
ఈనెల 13న శ్రీవాణి ఆఫ్‌లైన్ టికెట్ల నూతన కౌంటర్ ప్రారంభం
అయితే ప్రజెంట్ టీటీడీ తీసుకుంటున్న చర్యలు చూస్తే శ్రీవాణి ట్రస్టులు కొనసాగించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే తిరుమలలో శ్రీవాణి ఆఫ్ లైన్ టికెట్ల కేటాయింపు ప్రక్రియను మరింత సులభతరం చేసింది టీటీడీ. శ్రీవాణి దర్శన టికెట్ల విషయంలో ఇబ్బందులు తలెత్తకుండా నూతన పాలసీని తెచ్చారు అదనపు ఈఓ. ఈనెల 13న శ్రీవాణి ఆఫ్ లైన్ టికెట్ల నూతన కౌంటర్‌ను ప్రారంభించారు. నూతన పాలక మండలిలోని కొందరు సభ్యులు కూడా శ్రీవాణి ట్రస్ట్‌ను కొనసాగించేందుకే మొగ్గు చూపుతున్నారు. అయితే గత ప్రభుత్వంలా కాకుండా జవాబుదారిలా పనిచేస్తామంటున్నారు.
శ్రీవాణి ట్రస్ట్ కొనసాగించేందుకే భక్తుల మొగ్గు
శ్రీవాణి ట్రస్ట్‌కు 10 వేల రూపాయలు విరాళంగా చెల్లిస్తే VIP బ్రేక్ దర్శనం లభిస్తుందని భావించే భక్తులు ట్రస్ట్ కొనసాగించాలంటున్నారు. శ్రీవాణితో దళారీ వ్యవస్థ కట్టడి అవుతోందని భావిస్తున్నారు భక్తులు. ఇలా భిన్న వాదనలు వినిపిస్తున్న క్రమంలో టీటీడీ కొత్త పాలకమండలి శ్రీవాణి ట్రస్ట్ కొనసాగిస్తుందా లేక వెనక్కు తగ్గుతోందా? అన్నది ఇప్పుడు చర్చకు వస్తోంది. శ్రీవాణి ట్రస్ట్ విషయంలో టీటీడీ నిర్ణయం ఉత్కంఠ రేపుతోంది.