ఏపీలో మళ్లీ వర్షాలు దంచికొట్టనున్నాయి. అల్పపీడనం కారణంగా రాష్ట్రంలో వచ్చే 3 రోజులు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆ వివరాలు ఇలా..
ఏపీలో మళ్లీ భారీ వర్షాలు కురవనున్నాయి. నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. అల్పపీడనం ప్రభావంతో మూడ్రోజులు పాటు ఏపీలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ అల్పపీడనం రెండు రోజుల్లో పశ్చిమ దిశగా నెమ్మదిగా తమిళనాడు, శ్రీలంక తీరాల వైపు కదిలే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. అల్పపీడనం ప్రభావంతో వచ్చే మూడు రోజులు రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లోని కొన్నిచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.
మరోవైపు అల్పపీడనం ప్రభావంగా ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఎక్కడికక్కడ జనజీవనం స్తంభించింది. పలు చోట్ల వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. పట్టణ, నగర ప్రాంతాల్లోనూ డ్రెయిన్లు పొంగి పొర్లుతున్నాయి. మరో మూడ్రోజులు వర్షాలు అంటూ వాతావరణ శాఖ హెచ్చరికలతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఎక్కడికక్కడ ముందస్తు జాగ్రత్త చర్యల్లో నిమగ్నమైంది. ముఖ్యంగా నెల్లూరు, కావలి పట్టణాల్లో లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.