గుడిలో ప్రదక్షిణాలు చేయడానికి వెళ్లిన ఓ వ్యక్తి గుండెపోటుతో మృతి చెందాడు. ఈ విషాద సంఘటన హైదరాబాద్ మహానగరం పరిధిలో చోటు చేసుకుంది.
వాన రాకడ.. ప్రాణం పోకడ.. ఎవరూ చెప్పలేరంటారు. ఇటీవల కాలంలో రెప్పపాటులో ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా ఓ యువకుడు ఈ క్రమంలోనే ప్రాణాలు కోల్పోయాడు. గుడిలో ప్రదక్షిణాలు చేయడానికి వెళ్లిన ఓ వ్యక్తి గుండెపోటుతో మృతి చెందాడు. ఈ విషాద సంఘటన హైదరాబాద్ మహానగరం పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం కూకట్‌పల్లి హౌజింగ్ బోర్డు పోలీస్ స్టేషన్ పరిధిలోని కేబీహెచ్‌బీ రోడ్ నెంబర్ 1 లో అమ్మ హాస్టల్లో విష్ణువర్ధన్ అనే యువకుడు ఉంటున్నాడు. ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్న విష్ణువర్ధన్ ప్రతిరోజు ఉదయం వీరాంజనేయ స్వామి ఆలయానికి వెళుతుంటాడు. ఈ క్రమంలోనే ఆలయంలో ప్రదక్షిణలు చేస్తూ ఉండగా ఒక్కసారిగా గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయాడు ఈ దృశ్యాలన్నీ సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.
కూకట్‌పల్లి హౌజింగ్ బోర్డులో స్థానికంగా ఉన్నటువంటి వీరాంజనేయ స్వామి ఆలయంలో విష్ణువర్ధన్ అనే ప్రైవేటు ఉద్యోగి రోజులాగే ప్రదక్షిణాలు చేస్తున్నాడు. ఇంతలోనే విష్ణుకు కాస్త అలసటగా అనిపించింది. దీంతో ఆలయం లో ఉన్న ఫిల్టర్ వద్దకు వెళ్లి మంచినీరు తాగాడు. ఆ తర్వాత మళ్లీ ప్రదక్షిణలు చేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఆలయ అర్చకులు భక్తులు విష్ణువర్థన్‌ను పైకి లేపడానికి ప్రయత్నించారు. అయినా అతనిలో ఎలాంటి చలనం లేకపోయింది. దీంతో చివరకు 108 సహాయంతో ఆసుపత్రికి తరలించారు. విష్ణువర్ధన్‌ను పరిశీలించిన వైద్యులు మృతి చెందినట్లు తెలిపారు.
స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఆసుపత్రికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. విష్ణు మృతి చెందిన సంఘటన అంతా సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. విష్ణుకి పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు పోలీసులు. విష్ణువర్ధన్ విగతజీవిగా చూసిన తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. కార్తీక మాసం కావడంతో ఉదయం స్వామివారి దర్శనానికి వెళ్లాడని కానీ ఇలా విగతజీవిగా వస్తాడని ఊహించుకోలేకపోయామంటూ తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.