బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇప్పటికే ఢిల్లీలో ఉన్నారు. కాగా నేడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పయనమవుతున్నారు. ఇలా ఇద్దరు నేతలు ఢిల్లీలో ఉండడంతో తెలంగాణ రాజకీయ హస్తినాకు చేరినట్లైంది. ఇంతకీ అసలు ఏం జరుగుతోందన్న చర్చ మొదలైంది…
తెలంగాణ రాజకీయ హస్తినకు చేరింది. ఇప్పటికే బీఆర్ఎస్ నేత కేటీఆర్ ఢిల్లీలో ఉండగా. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీ పయనమవుతున్నారు. మంగళవారం రేవంత్ ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. దీంతో ఢిల్లీలో అసలేం జరగబోతోందన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఈ కారణంగానే తెలంగాణ పాలిటిక్స్ ఔట్ ఆఫ్ స్టేషన్‌గా మారాయి. మూడు పార్టీల ముఖ్య నేతలు రాష్ట్ర పాలిటిక్స్‌పై రాష్ట్రం దాటి విమర్శలు చేసుకోవడం హాట్‌టాపిక్‌గా మారాయి. ఢిల్లీ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్‌పై కేటీఆర్ కంప్లైంట్ చేస్తే.. మహారాష్ట్ర ప్రచారంలో కిషన్‌రెడ్డి కాంగ్రెస్ పై కౌంటర్స్‌కి రెడీ అయ్యారు. ఇదే తరుణంలో మరోసారి సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటన ఉత్కంఠ రేపుతోంది.
ఇక సీఎం రేవంత్ ఢిల్లీలో ఏఐసీసీ పెద్దలతో సమావేశం కానున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలతోపాటు కేబినెట్ విస్తరణపై పార్టీ పెద్దలతో చర్చిస్తారనే టాక్ వినిపిస్తోంది. దీంతోపాటు రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులపై హైకమాండ్‌కు వివరించనున్నారు. అలాగే సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు, కులగణనపై పార్టీ నేతలతో సుదీర్ఘంగా చర్చించే అవకాశం ఉంది. దీంతో సీఎం ఢిల్లీ టూర్‌పై తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠత రేపుతోంది.
ఇక పార్టీ పెద్దలతో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడుతారు సీఎం రేవంత్‌రెడ్డి. కేంద్రమంత్రులకు కేటీఆర్ ఫిర్యాదుపై.. ఆయనకు సీఎం కౌంటర్ ఇచ్చే అవకాశం ఉంది. అలాగే రేవంత్‌రెడ్డి ఢిల్లీ పెద్దల భేటీలో ప్రధానంగా మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ప్రచార సరళిపై చర్చిస్తారని టాక్. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి మరోవారం రోజులు మాత్రమే ఉన్నందున కాంగ్రెస్ పార్టీ వ్యూహంపై ఈసమావేశంలో రేవంత్ రెడ్డి చర్చించనున్నారు. ఢిల్లీలో పర్యటన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మహారాష్ట్ర వెళ్లనున్నారని తెలుస్తోంది. రెండు రోజుల పాటు ఆయన మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని పార్టీ నేతలు చెప్తున్నారు. ఇప్పటికే ముంబైలో తెలుగువారు ఉండే ప్రాంతాల్లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రచారం నిర్వహించారు. మరో మూడు, నాలుగుచోట్ల సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం ఉండే అవకాశముంది.
కేంద్ర మంత్రికి కేటీఆర్ ఫిర్యాదు..
ఇప్పటికే ఢిల్లీలో పర్యటిస్తున్న కేటీఆర్.. పలువురు కేంద్ర పెద్దలను కలిసే పనిలో ఉన్నారు. ఇప్పటికే సీఎం రేవంత్‌పై కేంద్రమంత్రి ఖట్టర్‌కు కేటీఆర్ ఫిర్యాదు చేశారు. అమృత్ పథకంలో అక్రమాలు జరిగాయంటూ కంప్లైట్ ఇచ్చారు కేటీఆర్. సీఎం రేవంత్ బావమరిది సృజన్ రెడ్డి కంపెనీకి అర్హత లేకున్నా టెండర్లు కట్టబెట్టారని.. అమృత్ 2.O ప్రాజెక్ట్‌లో తెలంగాణకు కేటాయించిన 8వేల 888 కోట్ల పనులపై విచారణ జరిపించాలని కేంద్రమంత్రిని కోరారు కేటీఆర్. అధికార దుర్వినియోగానికి పాల్పడ్డ ముఖ్యమంత్రిపై చర్యలు తీసుకోవాలని కేంద్రమంత్రి ఖట్టర్‌కు కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. మరి కేటీఆర్ ఫిర్యాదుపై కేంద్రమంత్రి ఏవిధంగా స్పందిస్తారో చూడాలి.
ముంబయిలో కిషన్ రెడ్డి..
మరోవైపు కేంద్రమంత్రి, టీబీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి సైతం ఔట్ ఆఫ్ స్టేషన్ ఉన్నారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం కోసం ముంబై చేరుకున్నారు కిషన్‌రెడ్డి. ఇవాళ మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు కేంద్రమంత్రి. ముంబయిలో మొన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రచారం చేసిన ప్రాంతాల్లో కిషన్‌రెడ్డి కూడా ప్రచారం నిర్వహించనున్నారు. రేవంత్‌రెడ్డి చేసిన కామెంట్స్ పై కౌంటర్ ఇవ్వనున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ఇప్పటికే తమ ప్రభుత్వం అమలు చేసిందంటూ రేవంత్‌రెడ్డి ప్రచారంలో చెప్పిన క్రమంలో.. సీఎం వ్యాఖ్యలను ముంబయి వేదికగా ఖండించనున్నారు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి.
కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ఫైయిల్ అయిందని.. ఆపార్టీ హామీలను నమ్మి తెలంగాణ ప్రజలు గోసపడుతున్నారంటూ కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఘాటైన విమర్శలు చేసే అవకాశం లేకపోలేదు. ఇలా.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, టీబీజేపీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ .. రాష్ట్రానికి చెందిన మూడు పార్టీల ముఖ్యనేతలు ఔట్ ఆఫ్ స్టేషన్‌గా తెలంగాణ రాజకీయాలు చేయడం ఆసక్తి రేకిస్తున్నాయి.