గత బీఆర్‌ఎస్ సర్కార్ వందల కోట్లతో యాదగిరిగుట్ట లక్ష్మీనర్సింహస్వామి ఆలయాన్ని పునర్నిర్మాణం చేసి.. యాదాద్రిగా మార్చేసింది. తెలంగాణ తిరుమలగా ప్రసిద్ధికెక్కిన ఈ పుణ్యక్షేత్రానికి భక్తుల తాకిడి కూడా పెరిగింది. అద్భుత కళాఖండంగా రూపుదిద్దుకున్న ఆలయాన్ని వీక్షించేందుకు ఎక్కడెక్కడి నుంచో భక్తులు వచ్చివెళ్తున్నారు.
పాంచ నారసింహుడు వెలసిన యాదగిరిగుట్ట స్వయంభూ క్షేత్రాన్ని అద్భుత శిల్పకళా సౌందర్యంతో ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దాలన్న తలంపునకు నేటితో పదేళ్లు నిండనున్నాయి. దేశంలో మరెక్కడా లేని విధంగా ఆధ్యాత్మిక, పర్యాటక ఆలయ నగరిగా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దివ్యక్షేత్రం రూపుదిద్దుకుంది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొనసాగిన యాదగిరిగుట్ట క్షేత్రాన్ని తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంతో యాదాద్రిగా పేరుమార్చి మరో తిరుమలగా తీర్చిదిద్దాలన్న రాష్ట్ర తొలి సీఎం కేసీఆర్ సంకల్పించారు. భవిష్యత్తులో ఈ ఆలయం వైకుంఠ వైభవంతో, ప్రాకారాలతో, స్వర్ణమయంగా నిర్మితమవుతుందని, జగద్విఖ్యాతి నొందుతుందని సాక్షాత్తూ నృసింహుడు, పరమేశ్వరుడే చెప్పినట్టు పురాణాలు ఘోషిస్తున్నాయి. కలియుగంలో ఈ అవకాశం ఎవరికి దక్కుతుందో, దైవ సంకల్పమేమిటో ఇంతకాలం ఎవరికీ అంతుచిక్కలేదు. చివరికి యుగయుగాలుగా ఎదురుచూస్తున్న ఆ ఉద్విగ్న ఘడియలు ఆసన్నమయ్యాయి. భక్తాగ్రేసరుడు కేసీఆర్ సత్సంకల్పంతో ఈ నిర్మాణం జరుగటం విశేషం.
యాదగిరిగుట్టపై అరెకరంలోని దేవాలయాన్ని 4.03 ఎకరాలకు విస్తరించి సంపూర్ణంగా కృష్ణశిలతో ఆవిష్కృతం చేశారు. యాదాద్రి ఆలయ పునర్నిర్మాణంతో పాటు ఇతర వనరులతో క్షేత్రాభివృద్ధి కోసం వైటీడీఏ రూ.1200 కోట్లు ఖర్చు చేసింది. నీళ్లు, నిధులు, నియామకాల కోసం రాష్ట్ర సాధనకు ఉద్యమిస్తున్న దశలోనే 2007లో కేసీఆర్ యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి క్షేత్రాన్ని సందర్శించి స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయాన్ని విశ్వఖ్యాతి గాంచేలా పునర్నిర్మించాలని ఆనాడే కేసీఆర్ సంకల్పించారు. నాటి ఆలోచనను తెలంగాణ రాష్ట్ర తొలి సీఎం హోదాలో 2014 అక్టోబరు 17న తన సంకల్పాన్ని కేసీఆర్ వెల్లడించారు.
యావత్ దేశం అబ్బురపడేలా యాదాద్రి ఆలయాన్ని తీర్చిదిద్దారు. ఆలయ అభివృద్ధికి రూ.509 కోట్లు, టెంపుల్ సిటీ అభివృద్ధికి రూ. 1325 కోట్లు ఖర్చు చేసింది. ఆలయ నిర్మాణంతో పాటు టెంపుల్ సిటీ అభివృద్ధి, మంచినీటి వసతి, కాటేజీల నిర్మాణం, రహదారులు, సరస్సులు, ఉద్యానవనాలు, అభయారణ్యాలు, నిత్యాన్నదాన సత్రాలు, కల్యాణ మండపాలు, వేద పాఠశాల, శిల్పనిర్మాణ సంస్థ వంటివి ఏర్పాటయ్యాయి. ఐదేళ్ల పాటు శ్రమించి ఆలయాన్ని కృష్ణ శిలలతో సర్వాంగ సుందరంగా నిర్మించారు. దీంతో యాదగిరి గుట్ట లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రం ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా రూపు దిద్దుకుంది. తెలంగాణ తిరుపతిగా పిలుచుకునే ఈ యాదగిరిగుట్ట ప్రపంచవ్యాప్తంగా నేడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. దీంతో స్వామి వారి సెలవు దినాలలో భక్తులు, సందర్శకులు పోటెత్తుతున్నారు.
ఈ ఆలయ నిర్మాణం కోసం కేసీఆర్ సాగించిన కృషి అపూర్వమైనది, అనితర సాధ్యమైనది, ఆచంద్రతారార్కం విలసిల్లేది. దైవ సంకల్పం మేరకు యాదాద్రి ఆలయాన్ని భూతలానికే తలమానికంగా స్వర్ణమయంగా కేసీఆర్ తీర్చిదిద్దడమే కాదు, ఆలయ విధులు, భక్తుల సందర్శకుల కోసం సకల సౌకర్యాలు సమకూర్చారు. యాదాద్రి నరసింహస్వామి ఆలయం పూర్తిగా రూపాంతరం చెందింది. నూతన గంభీర సర్వశిలానిర్మిత సువిశాలాలయం వెలిసింది. ఒక రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఏ విఘ్నాలు లేకుండా నిర్నిరోధంగా నృసింహాలయం నిర్మించడం దేశ చరిత్రలోనే ఓ ఉజ్వల ఘట్టం.
యాదాద్రి ఆలయ విమానం స్వర్ణమయం రూపకల్పనకు ఈ మధ్యే శ్రీకారం చుట్టారు. 60 కేజీల బంగారంతో స్వర్ణ తాపడానికి ప్రస్తుత రాష్ట్ర సీఎం రేవంత్‌రెడ్డి సూచనలతో, స్థానిక ఎమ్మెల్యే, విప్ బీర్ల అయిలయ్య ఆధ్వర్యంలో యాదాద్రి దేవస్థానం సదరు పనులకు నడుం బిగించింది.