ప్రపంచ పర్యాటకులను ఆకర్షించేందుకు ఏపీ ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటుంది. అల్లూరి జిల్లాలోని అరకులోయ పరిసర ప్రాంతాలలో పర్యాటక రంగం అభివృద్దికి జెట్ స్పీడ్‌తో కార్యాచరణ మొదలు పెట్టింది. అరకులోయలో పారా గ్లైడింగ్ ఇంట్రడ్యూస్ చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. ఇందుకోసం అనువైన ప్రాంతాల పరిశీలించింది. ఈమేరకు ఐటీడీఏ పీవో అభిషేక్ క్షేత్రస్థాయిలో పర్యటించారు. గాలి వాటం, ఫ్లయింగ్, లాండింగ్ కు అనువైన ప్రాంతాలుగా మాడగడ వ్యూ పాయింట్, జైపూర్ జంక్షన్ ఎంపిక చేశారు. విజయవంతంగా ట్రయల్ రన్ కూడా నిర్వహించారు. స్వయంగా గ్లైడింగ్ చేశారు పాడేరు ఐటిడిఎ పిఓ అభిషేక్. త్వరలోనే ఇక్కడ పారా గ్లైడింగ్ ప్రారంభిస్తామని చెప్పారు. తద్వారా ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు పెరుగుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటికే విశాఖ నగరం పోర్ట్ నగరంగా, సౌత్ ఇండియా టూరిస్ట్ ప్లేస్‌గా ప్రత్యేక గుర్తింపు సంతరించుకుంది. ఇక్కడి పర్యాటక ప్రాంతాలు టూరిస్టులను ఆకర్షిస్తూ ఉంటాయి. పొడవైన సాగరతీరం, ఆకట్టుకునే బీచ్ లు, ఉద్యానవనాలు, పచ్చని కొండలు, వారసత్వ కట్టడాలు, అభయారణ్యాలు వంటి ఎన్నో ప్రత్యేకతలతో వైజాగ్ నగరం ప్రముఖ పర్యాటక ప్రాంతంగా విలసిల్లుతోంది. ఈ క్రమంలో పారా మోటరింగ్ గ్లైడింగ్ రాకతో పర్యాటకుల తాకిడి మరింతగా పెరగనుంది.