ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పినపాక ఏజెన్సీలో ఆదివాసీల జాతర ఘనంగా జరుపుకున్నారు. తమకు వచ్చే మొదటి పంటలను వనదేవతలకు నైవేద్యం పెట్టి.. ప్రకృతితో మమేకమైన అడవి బిడ్డలు అడవి తల్లికి పూజలు చేశారు. తమ వారసత్వాన్ని పరిరక్షించుకునేలా కొత్తల పండుగను ఆదివాసి గూడెంలలలో వేడుకలు కొనసాగుతున్నాయి.
ప్రపంచం టెక్నాలజీ పరంగా దూసుకుపోతున్న, పల్లెలు పట్టణాలుగా మారిపోతున్న.. ఆదివాసీలు మాత్రం తమ సంస్కృతి సాంప్రదాయాలను ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు, మనిషి జీవనశైలి లో ఎన్నో మార్పులు వస్తున్న ఆదివాసీలు మాత్రం తమ వారసత్వంగా వచ్చే పండుగలను ఇంకా జరుపుకుంటూ ఉండడం వారి ఆచారాలకు నిదర్శనం. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఆదివాసి గూడాలలో వేడుకగా జరుగుతున్న కొత్తల పండుగ (పెద్దల పండుగ) గురించి తెలుసుకుందాం..
తరతరాల వారసత్వాన్ని పరిరక్షించుకోవడం ఈ కొత్తల పండగ ఉద్దేశమని ఆదివాసీల ప్రధాన నమ్మకం. ఈ క్రమంలోనే వానాకాలం మొదట్లో సాగు చేసే పంట చేతికొచ్చే సందర్భంగా అడవిలో ఉండే చెట్లకు పూజలు చేయడమే కాకుండా తమ ఇలవేల్పులు అయినటువంటి దేవతలకు ఆ పంటను నైవేద్యాలుగా సమర్పించడం ఆదివాసీలకు అనాదిగా వస్తున్న ఆచారం. తాము సాగు చేస్తున్న కూరగాయలు, పంటలు పెద్దలకు సమర్పించాకే ఆదివాసీలు భుజించడం ఆనవాయితీ.
ఉత్తర కార్తె మొదటీ వారం అనగా సెప్టెంబర్లో కొత్తల పండుగ (పెద్దల పండుగ) జరుపుకుంటారు, ప్రధానంగా బుధ, గురు, ఆదివారాలు ఈ వేడుకలను నిర్వహిస్తూ ఉంటారు, ప్రకృతిలో భాగంగా ఉండే అనేక చెట్లను వీరు పూజించడమే కాక తమ ఇలవేల్పులను కొలుస్తూ.. పెద్దలను స్మరించుకోవడం ఈ కొత్తల పండుగ ఆచారం. ఈ పండగ పూర్తిగా ప్రకృతితో మమేకమై జరుపుకుంటారు ఆదివాసీలు. కొత్తల పండుగ వచ్చిందంటే తమ ఇళ్ళను అలంకరించి మొదటి పంటగా వచ్చిన మొక్కజొన్న వరి కంకులను తోరణాలుగా కడతారు. పెద్దమనుషుల సమక్షంలో ఇలవేల్పులను కొలిచి అనంతరం కోళ్లను అర్పిస్తారు. అంతేకాకుండా ఆదివాసీలు దేవతలుగా కొలిచే పాల, విప్ప చెట్లకు సంబంధించిన ఆకులను కూడా ఇంటికి తీసుకువచ్చి పూజల నిర్వహించి తమ పెద్దలను స్మరించుకుంటారు.
ప్రస్తుతం ఉత్తర కార్తె నడుస్తుండడంతో ఆదివాసి గుడాలలో పండగ వాతావరణం నెలకుంది. గ్రామ గ్రామాన ప్రతి ఇంట్లో సందడి నెలకొంది. పిల్లా పాపలతో కలిసి తమ పంటలను ప్రకృతికి నైవేద్యంగా సమర్పించి వేడుకలు జరుపుకుంటున్నారు గిరిజనులు. ఓవైపు దేశం టెక్నాలజీ పరంగా దూసుకుపోతున్న మరోవైపు ఆదివాసీలు మాత్రం తమ ఆచారాలను ఇంకా కొనసాగించడం చూస్తుంటే ప్రకృతి పట్ల వారికి ఎంత ప్రేమ దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు..