మాదాపూర్‌లో పెట్టుబడుల పేరుతో మోసం.. రూ.700 కోట్ల చీటింగ్..

మాదాపూర్‌లో పెట్టుబడుల పేరుతో మోసం.. రూ.700 కోట్ల చీటింగ్..

హైదరాబాద్‌లో ఓ సంస్థ.. అధిక వడ్డీ ఆశ చూపి.. వేల మందిని ముంచేసింది. కోటి.. రెండు కోట్లు కాదు.. ఏకంగా.. 700కోట్లు వసూలు చేసి.. బిచాణా ఎత్తేయడంతో లబోదిబోమంటున్నారు బాధితులు.

ఉద్యోగాల పేరుతో కొన్ని కంపెనీలు.. అధిక వడ్డీల పేరుతో మరికొన్ని సంస్థలు.. పేరు ఏదైనా.. మోసం మాత్రం కామన్‌ అయిపోతోంది. అవును.. ఈ మధ్యకాలంలో ఉద్యోగాల పేరుతో డబ్బులు వసూలు చేయడం తీరా కొద్దినెలల తర్వాత బిచాణా ఎత్తేయడం.. అలాగే.. అధిక వడ్డీలు పేరు చెప్పి కొన్ని సంస్థలు ప్రజల్ని నిండా ముంచేస్తున్నాయి. ఎన్ని మోసాలు వెలుగులోకి వచ్చినా.. ప్రజల్లో మాత్రం మార్పు రావడంలేదు. మొన్నామధ్య హైదరాబాద్‌లోని సాఫ్ట్‌వేర్‌ కంపెనీ బోర్డు తిప్పేసి వందలాది మంది నిరుద్యోగులను రోడ్డున పడేసింది. ఉద్యోగాల పేరుతో 10 కోట్లు వసూలు చేసి నిర్వాహకులు ఉడాయించడంతో మోసపోయిన బాధితులు కన్నీళ్లు పెట్టుకుంటూ పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటన మరువకముందే హైదరాబాద్‌లో మరో ఘటన తెరపైకి వచ్చింది.

తాజాగా.. హైదరాబాద్‌ మాదాపూర్‌లోని DKZ టెక్నాలజీస్ కంపెనీ అధిక వడ్డీల పేరుతో 700కోట్లు వసూలు చేసింది. కంపెనీలో పెట్టుబడులు పెడితే అధిక వడ్డీలు ఇస్తామని పెద్దయెత్తున ప్రచారం చేయడంతో విశేష స్పందన వచ్చింది. మొదట పెట్టుబడి పెట్టిన వాళ్లకి వడ్డీ రూపంలో అధికంగా చెల్లించారు నిర్వాహకులు. ప్రతి నెల వడ్డీలు తిరిగి చెల్లిస్తుండడంతో వేల మందితో పెట్టుబడులు పెట్టించారు కొందరు సభ్యులు. అయితే.. రెండు నెలల నుంచి డబ్బులు చెల్లించక పోవడంతో కంపెనీ నిర్వాహకులను నిలదీశారు డబ్బులు కట్టించినవారు, కట్టినవారు. దాంతో.. ఏకంగా.. మాదాపూర్‌లోని ఆఫీస్‌కి తాళం వేసి పరారయ్యారు DKZ టెక్నాలజీస్ కంపెనీ నిర్వాహకులు. మోసపోయామని తెలుసుకున్న బాధితులు.. హైదరాబాద్ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మహమ్మద్ ఇక్బాల్, రాహిల్ అనే వ్యక్తులు DKZ సంస్థను నిర్వహిస్తున్నట్లు తేల్చారు. నిత్యవసర వస్తువులు, ఎలక్ట్రానిక్ పరికరాలు, స్టోర్స్ ద్వారా ఈ కామర్స్ రూపంలో విక్రయిస్తున్నామని నిందితులు ప్రచారం చేసినట్లు తెలిపారు. ఇక.. DKZ టెక్నాలజీస్ కంపెనీ నిర్వాహకులు.. సుమారు 18వేల మందిని మోసం చేసినట్లు తెలుస్తోంది. అయితే.. ఇలాంటి కంపెనీల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు హైదరాబాద్‌ పోలీసులు.

Please follow and like us:
తెలంగాణ వార్తలు