అన్నవరంలో సికింద్రాబాద్ వెళుతున్న విశాఖ ఎక్స్‌ప్రెస్ లింగంపల్లి నుంచి విశాఖపట్నం వెళ్తున్న జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌లు ఆగిపోయింది. విశాఖ ఎక్స్‌ప్రెస్ సాంకేతిక సమస్యతో నిలిచిపోగా.. జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ను కూడా అక్కడే నిలిపివేశారు. జన్మభూమి రైలు ఇంజన్‌ను విశాఖ ఎక్స్‌ప్రెస్ రైలుకు తగలించి అక్కడి నుంచి పంపించారు. ఆ తర్వాత విశాఖ ఎక్స్‌ప్రెస్ రైలు ఇంజన్‌ను మరమ్మత్తు చేసి జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌కు కలిపిన తర్వాత అక్కడి నుంచి వెళ్లింది.
ప్రధానాంశాలు:
అన్నవరంలో ఆగిన రెండు ఎక్స్‌ప్రెస్ రైళ్లు
విశాఖ ఎక్స్‌ప్రెస్ రైలులో సాంకేతిక సమస్య
రైలు ఇంజన్లు మార్చి పంపించిన అధికారులు
కాకినాడ జిల్లా అన్నవరం రైల్వే స్టేషన్‌లో రెండు ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆగిపోయాయి. శుక్రవారం రాత్రి జన్మభూమి, విశాఖ ఎక్స్‌ప్రెస్ రైళ్లు 3 గంటలపాటు నిలిచిపోయాయి. భువనేశ్వర్ నుంచి సికింద్రాబాద్ వెళుతున్న విశాఖ ఎక్స్‌ప్రెస్ రైలు ఇంజిన్ సాంకేతిక సమస్యతో అన్నవరం స్టేషన్‌లో ఆగిపోయింది. రైలులోని ఏసీ బోగీలకు విద్యుత్తు సరఫరా నిలిచిపోగా.. సాయంత్రం 6.30 గంటల సమయంలో ఆగింది. ఇదే సమయంలో లింగంపల్లి నుంచి విశాఖ వస్తున్న జన్మభూమి ఎక్స్‌ప్రెస్ కూడా అన్నవరం స్టేషన్‌లో నిలిపివేశారు.
ఈ రైలు విశాఖ వెళ్లాల్సి ఉండటంతో జన్మభూమి ఎక్స్‌ప్రెస్ ఇంజిన్‌ను విశాఖ ఎక్స్‌ప్రెస్ రైలుకు కలిపారు. ఆ తర్వాత సుమారు రెండు గంటల అనంతరం రాత్రి 8.40 గంటలకు అన్నవరం నుంచి విశాఖ ఎక్స్‌ప్రెస్ రైలు బయల్దేరింది. అనంతరం సాంకేతిక సమస్య ఏర్పడిన విశాఖ ఎక్స్‌ప్రెస్ రైలు ఇంజిన్‌కు మరమ్మతు చేసిన తర్వాత జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌కు కలిపారు. దీంతో ఇది రాత్రి 9.20 గంటలకు ఆ రైలు కూడా విశాఖపట్నం బయల్దేరింది. ఈ పనుల్ని రైల్వే అధికారులు పర్యవేక్షించారు.
మరోవైపు భారీ వర్షాల కారణంగా విశాఖ-కిరండూల్ ఎక్స్‌ప్రెస్‌ను దారి మళ్లించారు. సెప్టెంబరు 1వ తేదీ వరకు విశాఖ-కిరండూల్(18514) రాత్రి ఎక్స్‌ప్రెస్ విజయనగరం, రాయగడ, కొరాపుట్ మీదుగా దంతెవాడ వరకు నడుస్తుందని వాల్తేరు సీనియర్ డీసీఎం కె.సందీప్ తెలిపారు. ఈ రైలు తిరుగు ప్రయాణంలో కిరండూల్-విశాఖ(18513) రాత్రి ఎక్స్‌ప్రెస్ కిరండూల్ బదులు దంతెవాడ నుంచి బయలుదేరి కొరాపుట్, రాయగడ, విజయనగరం మీదుగా విశాఖ వస్తుంది. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.దిలా ఉంటే.. వారానికి ఒకసారి నడిచే పూరీ- గాంధీదామ్ ఎక్స్‌ప్రెస్ (22974) ఆగస్టు 31న రద్దు చేశారు. దీంతో ప్రయాణికులు ఇబ్బందిపడతారని భావించిన అధికారులు.. పూరీ-ఉద్నా మధ్య ప్రత్యేక రైలు నడిపాలని నిర్ణయించారు. పూరీ-ఉద్నా ప్రత్యేక రైలు (08436) శనివారం ఉదయం 11.15 గంటలకు పూరీలో బయలుదేరి శ్రీకాకుళంకు సాయంత్రం 4.28, విజయనగరం 5.25, రాయగడ 7.55 మీదుగా ప్రయాణించి మరుసటి రోజు రాత్రి 7.55 గంటలకు ఉద్నా చేరుకుంటుందన్నారు. ఈ రైలు తిరుగు ప్రయాణంలో ఉద్నాలో ఆదివారం రాత్రి 10.55 గంటలకు బయలుదేరి మంగళవారం ఉదయం 8.35 గంటలకు పూరీ చేరుతుంది.