ప్రాబ్లమ్ ఏదైనా సొల్యూషన్ మాత్రం… కేబినెట్ సబ్ కమిటీలతోనే అంటోంది అధికార కాంగ్రెస్. కాదుకాదు… సబ్ కమిటీలే అసలు ప్రాబ్లమ్ అంటోంది బీఆర్ఎస్. దీంతో తెలంగాణలో రాజకీయం నెక్ట్స్ లెవల్‌కి చేరింది. నేతల మధ్య మాటల తూటాలతో… ఏకే 47 రేంజ్‌లో పేలుతున్నాయి.
తెలంగాణ రాజకీయాలు యమారంజుగా మారాయి. అధికార, ప్రతిపక్షాల మధ్య డైలాగ్ వార్ నెక్ట్స్ లెవల్‌కి వెళ్లింది. మొన్నటిదాకా అసెంబ్లీ సమావేశాల్లో రచ్చ నడిస్తే… లేటెస్ట్‌గా కేబినెట్ సబ్ కమిటీలపై పొలిటికల్ ఫైట్ పీక్స్‌కి చేరింది. అసలెందుకీ కేబినెట్ సబ్ కమిటీలు…? దేనికి ఉపయోగం…? ఎవరికి లాభం…? అంటూ నిప్పులు కక్కుతున్నారు బీఆర్ఎస్ నేతలు. ప్రతీ దానికి సబ్ కమిటీయేనా…? అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఇవి సబ్-కమిటీలు కాదు.. కాలక్షేమం కోసం అధికార కాంగ్రెస్ చెబుతున్న కహానీలు అంటూ ఫైర్ అవుతున్నారు. ఇప్పటివరకు ఏ ఒక్క సబ్ కమిటీ కూడా సమస్య పరిష్కారం కోసం పనిచేయలేదంటూ ఆగ్రహావేశాలు వెళ్లగక్కుతున్నారు.
లేటెస్ట్‌గా ఈ కేబినెట్ సబ్-కమిటీలపై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి ఫుల్ సీరియస్ అయ్యారు. ప్రాజెక్టుల్లో నీళ్లు నిల్వ చేయండయ్యా అంటే… సబ్ కమిటీలు వేయడం విచిత్రంగా ఉందన్నారు. అంతేకాదు రేషన్ కార్డుల అర్హులను గుర్తించడానికి.. ఆఖరికి తెలంగాణ చిహ్నాల మీదా కూడా సబ్-కమిటీ వేయడం ఏమన్న బాగుందా అంటూ మండిపడ్డారు. ఈ సబ్-కమిటీలు భేటీ అయ్యి… నిర్ణయాలు తీసుకునేలోపు పుణ్యాకాలం కాస్తా పూర్తవుతుందన్నారు. సబ్ కమిటీలన్నీ ముమ్మాటికి కాలయాపన చేయడానికే అంటూ తనదైన స్టైల్‌లో విమర్శించారు.
ఇటు బీఆర్ఎస్ మాటలను తిప్పికొడుతోంది అధికార కాంగ్రెస్. కేబినెట్ సబ్ కమిటీలతోనే సమస్యలకు పరిష్కారం దొరుకుతుందంటున్నారు. సబ్ కమిటీల పనితీరు ఏంటో చూపిస్తామంటున్నారు. పేదవారికి, అర్హులైన ప్రతివారికి న్యాయం చేయడానికే ఈ సబ్ కమిటీలంటూ క్లారిటీ ఇస్తున్నారు. ప్రతి అంశాన్ని రాజకీయం చేయడం బీఆర్ఎస్‌కు అలవాలంటూ కౌంటర్ ఎటాక్‌కి దిగుతున్నారు కాంగ్రెస్ నేతలు..
ఇక ఈ ఏడు నెలల పాలనలో… ఇప్పటివరకు దాదాపు ఏడు కేబినెట్ సబ్-కమిటీలను వేసింది అధికార కాంగ్రెస్. జీవో 317పై సబ్ కమిటీ, కొత్త రేషన్ కార్డులు, హెల్త్ కార్డులపై మరో సబ్ కమిటీ, అలాగే ఆరు గ్యారంటీలపైనా, జలవనరులపైనా, ధరిణి సమస్యలపైనా, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి… ఇలా ఇప్పటివరకు ఏడు సబ్ కమిటీలను ఏర్పాటు చేసింది. ఈ కమిటీలన్నీ ప్రజా సమస్యల పరిష్కారానికే అంటోంది.
మొత్తంగా… కేబినెట్ సబ్ కమిటీలపై ఖతర్నాక్ ఫైట్ నడుస్తోంది. అధికార, ప్రతిపక్ష నేతలు… ఏమాత్రం తగ్గట్లేదు. మరీ ఇష్యూ ఇంకెంత దూరం వెళ్తుందో చూడాలి…!