నంద్యాల జిల్లా చాగలమర్రి మండలం చిన్న వంగలిలో విషాదం జరిగింది. మట్టి మిద్దె కూలి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతిచెందారు. వీరంతా ఇంట్లో నిద్రిస్తుండగా గురువారం అర్ధరాత్రి మట్టి మిద్దె కూలినట్లు స్థానికులు చెబుతున్నారు
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. అనేక గ్రామాలు వరదలో మునిగిపోయాయి. రహదారులు జలమయం అయ్యాయి. చెట్లు, పుట్టలు కొట్టుకుపోతున్నాయి. పలుచోట్ల ఇళ్లు కూడా కూలిపోతున్నాయి. ఈ క్రమంలో నంద్యాల జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. అర్ధరాత్రి ఓ ఇంటి మిద్దె కూలి నలుగురు మృతి చెందారు. ఈ ఘటన స్ధానికంగా తీవ్ర విషాదం నింపింది.
జిల్లాలోని చాగలమర్రి మండల పరిధిలోని చిన్న వంగలి గ్రామంలో ఈ విషాద ఘటన జరిగింది. గ్రామానికి చెందిన తల్లపురెడ్డి గురు శేఖర్ రెడ్డి, ఆయన భార్య ఇద్దరు పిల్లలు రాత్రి భోజనాలైన తర్వాత అంతా నిద్రపోయారు. వారిది మట్టి ఇల్లు కావడంతో అర్థరాత్రి మట్టి మిద్దె కూలిపోయి నలుగురూ మృతి చెందారు. గాఢ నిద్రలో ఉండగా ఒక్కసారిగా మిద్దె కూలి వారిపై పడటంతో ఆ మట్టి కింద కూరుకుపోయి ప్రాణాలు కోల్పోయారు. ఉదయం చుట్టుపక్కలవారు వచ్చి చూసి షాకయ్యారు. శిథిలాల కింద చిక్కుకున్న వారి మృతదేహాలను గ్రామస్థులు వెలికి తీశారు. నలుగురు కుటుంబ సభ్యులూ అలా ప్రాణాలు కోల్పోవడం చూపరులను కంటతడి పెట్టించింది. వీరి మరో కుమార్తె ప్రసన్న పొద్దుటూరులో చదువుకుంటోందని స్థానికులు తెలిపారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.. కేసు నమోదు చేశారు.