ఎల్లలు దాటి వచ్చి గ్రామదేవతలకు ప్రణమిల్లి..
దర్శనం కోసం దేశం నలుమూలల నుంచి..
అనామకుల నుంచి అపర కుబేరుల వరకు..
సర్పంచ్ నుంచి ప్రధాని వరకు..
భాగ్యనగరంలో గ్రామ దేవతల సేవలో భక్తజనం పునీతం..
గ్రామ దేవత.. గ్రామానికి రక్ష.. పాడి పంటలు, సుఖ సంతోషాలు, సకల సౌభాగ్యాలు కలిగించే కల్పవల్లి. ఆ ఊరి వారి కోర్కెలు తీర్చే ఇలవేల్పు. అమ్మలు గన్న అమ్మకు ఆ గ్రామస్తులు భక్తి ప్రపత్తులతో అమ్మవారి మొక్కులు తీర్చుకుంటారు. ఊరంతా ఏకమై ఏటేటా అమ్మవారికి వివిధ రూపాల్లో ఉత్సవాలు జరుపుతూ ఆశీర్వచనాలు పొందుతుంటారు. ఇది అనాదిగా వస్తున్న భక్తిపూర్వక ఆచారం. గ్రామ ప్రజల అపార విశ్వాసం. అప్పటివరకూ ఒక ఊరు వారు మాత్రమే చవిచూసిన అమ్మవారి ఆశీస్సుల మహిమలు జిల్లా, రాష్ట్ర, దేశ, ఖండాలను పాకి ఇప్పుడు ఆ తల్లికి విశ్వమంతా బంధువులయ్యారు. గాలిమోటారెక్కి మరీ అమ్మవారి మొక్కులు తీర్చుకుని వెళ్తుంటారు. ఔను..ఇది అక్షరాల నిజం. ఒకప్పుడు ఊరి భక్తులు తమ ప్రాంతానికే రక్ష అని భావించగా..ఇప్పుడు విశ్వమే ఊరుగా మారి అమ్మవారి ఆశీస్సుల కోసం క్యూ కడుతున్నారు.
గ్రామ దేవతలు అయిన సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి, బల్కంపేట ఎల్లమ్మ, జూబ్లీహిల్స్ పెద్దమ్మ, బేగంపేట కట్టమైసమ్మ, శివారు ప్రాంతాల్లో భక్తులచే నిత్య పూజలందుకుంటున్న గండిమైసమ్మ, మైసిగండి.. ఇలా ఎందరో గ్రామ దేవతలు మమ్ము కాసే దేవతలుగా భక్తజనం దండాలు పెట్టుకుంటూ మొక్కులు తీర్చుకుంటారు. అమ్మవార్ల ఆలయాలకు ఎక్కడెక్కడి నుంచో భక్తులు వ్యయప్రయాసలకోర్చి వస్తుంటారు. ఆ ఆలయాలు నిత్య కళ్యాణం.. పచ్చతోరణం అన్నట్లు భక్తకోటి దర్శనాలతో విలసిల్లుతున్నాయి.
నాడు బెహలూన్ఖాన్.. నేడు బల్కంపేట..
బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి ఆలయం తెలంగాణ ప్రాంతమే కాదు..దేశంలోనే సుప్రసిద్ధ ఆలయం. నగరం ఏర్పడకముందు ఇది కుగ్రామంగా ఉండేది. రాజాశివరాజ్ బహద్దూర్ అనే సంస్థానాదీశుడి హయాంలో ఈ ప్రాంతాన్ని బహలూన్ఖాన్ గూడగా పిలిచేవారు. కాలక్రమేణా అది కాస్తా బల్కంపేటగా మారి ఇప్పుడు ఎల్లమ్మ అమ్మవారి ఆలయంతో ఆ గ్రామం విశ్వవ్యాప్తమైంది. ఎక్కడెక్కడి నుంచో భక్తులు అమ్మవారి దర్శనార్థం వస్తుంటారు.
రథోత్సవ వేళ..
ఇక బోనాలు, కళ్యాణ మహోత్సవాలు, రథోత్సవాల వేళ..‘అమ్మ’ దర్శనం కోసం రెక్కలు కట్టుకుని మరీ విదేశాల నుంచి వచ్చేస్తారు. అంతెందుకు.. ఎక్కడో అమెరికాలో ఉండి కూడా ఆన్లైన్ ద్వారా అమ్మవారికి చీరలు తెప్పించి మరీ ప్రదానం చేస్తుంటారంటే అమ్మవారిపై భక్తిప్రపత్తులు ఏపాటివో అర్థమవుతుంది. అలాగే అమ్మవారి చీరలు వేలం ఎప్పుడెప్పుడా అంటూ వేచిచూస్తూ ఎక్కడో విదేశాల్లో ఉన్నవారు సైతం వాటిని తీసుకునేందుకు పోటీపడుతుంటారు.
లష్కర్లో కొలువై..విశ్వమంతా వ్యాపించి..
ఉజ్జయినీలో కలరాతో అల్లాడుతుంటే నగరం నుంచి ఓ మిలటరీ టీమ్ అక్కడి సేవా కార్యక్రమాల్లో పాల్గొంది. ఆనాడు 13 కులాలకు చెందిన వారు టీమ్‌గా అక్కడికి వెళ్లగా తమకెవరికీ ఏమి కాకుండా సురక్షితంగా ఇంటికి చేరునేలా చూడు తల్లీ అంటూ ఉజ్జయినీ అమ్మవారి సూరిటి అప్పయ్య అనే భక్తుడు వేడుకుంటే.. ఆ తల్లి కటాక్షించింది. ఆ భక్తుడు మొక్కుకున్న విధంగా ఆ ఉజ్జయినీ మహంకాళిని లష్కర్లో ప్రతి చాడు. అలా కొలువైన మహంకాళిని కొన్ని దశాబ్దాలుగా కేవలం ఆ ప్రాంతం వారే మొక్కుకుని నిత్య పూజలు చేస్తూ వచ్చారు. రానురాను ఎల్లలు దాటి మరీ భక్తులు దేశ, విదేశాల నుంచి వచ్చి అమ్మవారిని వేడుకుంటున్నారు.
అమ్మవారి సేవలో జాతీయ, రాష్ట్ర ప్రముఖులు..
ఒకనాడు గ్రామ సర్పంచ్, పెద్దల పర్యవేక్షణలో నిర్వహించే ఉజ్జయినీ జాతరకు చుట్టుపక్కల ఊళ్లకు చెందిన వారు మాత్రమేబండ్లు కొట్టుకొని వచ్చేవారు. రాష్ట్రపతి, ప్రధానమంత్రి వరకూ అమ్మవారిని దర్శించుకుంటున్నారు. 1982–1987 కాలంలో రాష్ట్రపతి హోదాలో జ్ఞాన్జైల్సింగ్ అమ్మవారిని దర్శించుకున్నారు. ఇటీవల నగర పర్యటనకు విచ్చేసిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ అమ్మవారి సేవలో పునీతులయ్యారు. అంతకముందు అమిత్ షా, నడ్డా వంటి జాతీయ నాయకులు అమ్మవారిని దర్శించుకున్నారు.
నీతా అంబానీ.. ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల్లో ఒకరైన ముఖేష్ అంబానీ సతీమణి. ఆమె అడుగుపెట్టిన ప్రతిసారీ బల్కంపేట ఎల్లమ్మను దర్శించుకుని ఆశీస్సులు తీసుకోవడం పరిపాటి. ఇక గవర్నర్, రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన దివంగత నేత రోశయ్య బతుకున్నంతకాలం అమ్మవారి సేవలో పునీతులయ్యారు. వీరే కాదు..రాజకీయ, వ్యాపార తదితర రంగాల్లో ఉన్నవారు బల్కంపేట ఎల్లమ్మ అంటే అపార భక్తి విశ్వాసం. పొన్నం ప్రభాకర్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, కేసీఆర్ కుటుంబ సభ్యులు, మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, దానం నాగేందర్ ఇలా రాష్ట్రానికి చెందిన వారే కాదు..ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు, ఢిల్లీ ఇలా దక్షిణ, ఉత్తర భారతదేశం అని తేడా లేకుండా విభిన్న రాష్ట్రాలకు చెందిన ఎందరో భక్తజనులు అమ్మవారి దర్శనం కోసం వస్తుంటారు.
ఊహ తెలిసినప్పటి నుంచి..
ఊహ తెలిసినప్పటి నుంచి మహంకాళి జాతరను చూస్తున్నాను. అప్పట్లో లష్కర్ ప్రాంత ప్రజలే పూజించి మొక్కులు తీర్చుకునేవారు. భక్తులు పెరిగే కొద్ది ఆలయం విశాలంగా మారుతూ వచి్చంది.
ఎక్కడెక్కడో స్థిరపడ్డవారు కూడా..
బల్కంపేట ఎల్లమ్మ, సికింద్రాబాద్ మహంకాళి అమ్మవార్లు ఆశీస్సులు ఉంటే ఏదైనా సాధించగలమన్న నమ్మకం. ఎక్కడెక్కడో స్థిరపడ్డ వారైనా దర్శనం కోసం వస్తుంటారు. మొక్కులు తీర్చుకుంటారు.
–అన్నపూర్ణ, బల్కంపేట ఎల్లమ్మ, సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి ఆలయాల పూర్వ ఈఓ
హుండీ ఆదాయం లెక్కించే సమయంలో విదేశీ కరెన్సీ కూడా కనిపిస్తుంటుంది. ముఖ్యంగా అమెరికా, ఆస్ట్రేలియా కరెన్సీలు ఎక్కువగా వస్తుంటాయి. ఆలయానికి రాలేని భక్తుల కోసం ఆన్లైన్ హుండీ విధానాన్ని కూడా దేవాదాయ శాఖ