ఫిరాయింపులపై బీజేఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను బెదిరించి కాంగ్రెస్‌లో చేర్చుకుంటున్నారని ఆరోపించారు. కాంగ్రెస్‌లో చేరుతున్న ఎమ్మెల్యేలు అక్కడ ఉండలేరని ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ లో నిర్వహించిన బీజేఎల్పీ సమావేశంలో మీడియాతో మాట్లాడుతూ కొన్ని కీలక కామెంట్స్ చేశారు. చాలామంది బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు బీజేపీతోనూ టచ్‌లో ఉన్నారని.. అయితే, రాజీనామాచేసి రావాలని షరతు ఉండడంతో వెనకడుగు వేస్తున్నారేమో! అన్నారు. రాజీనామా కండీషన్ లేకపోతే బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలంతా బీజేపీలోకే వస్తారని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎప్పుడైనా ఏమైనా జరగొచ్చు అంటూ రాజకీయ ఉత్కంఠకు తెరలేపారు.
కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఇంకా అమలు చేయలేదన్నారు. మ్యానిఫెస్టోలో ఇచ్చిన 419 హామీలు ఎందుకు నెరవేర్చడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో అతి తక్కువ కాలంలో అప్రతిష్ట మూటకట్టుకున్న ప్రభుత్వం కాంగ్రెస్ అని విమర్శించారు. గతంలో బీఆర్ఎస్ కూడా ఇలాగే పార్టీలో చేర్చుకుంటూ ఫిరాయింపులను ప్రోత్సహించిందని గుర్తు చేశారు. అలా పార్టీ మారిన వారిలో ఎంత మంది ఎమ్మెల్యేలు మొన్న జరిగిన ఎన్నికల్లో గెలిచారని ప్రశ్నించారు. తాము ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటాలు చేస్తూనే సంస్థాగతంగా బీజేపీ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై కార్యాచరణ రూపొందించుకున్నట్లు తెలిపారు. సర్పంచుల నుంచి జిల్లాపరిషత్ చైర్మెన్ వరకూ అన్నిటా బీజేపీ పోటీ చేస్తుందని చెప్పకనే చెప్పేశారు. బీజేపీ కేడర్ బేస్డ్ పార్టీ అని, కేడర్ నుంచే లీడర్ వస్తాడన్నారు. ఇప్పుడు బీజేపీలో గెలచిన వాళ్లు చాలా మంది అలా వచ్చిన వాళ్లే అని చెప్పారు. రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేయాలన్నదే తమ లక్ష్యం అన్నారు.