అమరావతి నిర్మాణాల విషయంలో అత్యంత పకడ్బందీగా ముందుకెళ్లాలని చంద్రబాబు ప్రభుత్వం భావిస్తోంది. గత ఐదేళ్లలో అమరావతికి ఎలాంటి నష్టం జరిగిందనేది స్వయంగా సీఎం చంద్రబాబు శ్వేతపత్రం రూపంలో వివరించారు. టీడీపీ ప్రభుత్వంలో నిర్మాణాలు ప్రారంభమైన చాలా భవనాల పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. ఐదేళ్ళపాటు ఆయా భవనాలను పట్టించుకోకపోవడంతో తీవ్ర నష్టం వాటిల్లింది. అమరావతిలో తిరిగి నిర్మాణ పనులు ప్రారంభించే ముందు.. అసలు ఎంత నష్టం జరిగిందనే దానిపై ప్రభుత్వం ముందుగా దృష్టి సారించింది. అమరావతిలో మధ్యలో నిర్మాణాలు నిలిచిపోయిన కట్టడాల పటిష్టతపై ముందుగా ఒక అంచనాకు రావాలని నిర్ణయించింది. దీనికోసం ఐఐటి నిపుణుల చేత కట్టడాల పటిష్ఠతపై అధ్యయనం చేయించాలని నిర్ణయించినట్లు ఏపీ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు.
గతంలో ఫౌండేషన్ పూర్తి చేసుకున్న ఐకానిక్ భవనాలతో పాటు ఇతర నిర్మాణాలపై- ఐఐటి ఇంజినీర్ల చేత అధ్యయనం చేయించబోతోంది ఏపీ ప్రభుత్వం. ఐకానిక్ కట్టడాల ఫౌండేషన్ పటిష్టత నిర్దారణ కోసం ఐఐటి చెన్నైకి బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించింది. మరోవైపు ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉద్యోగుల క్వార్టర్ల పటిష్టత నిర్దారణ కోసం ఐఐటీ హైదరాబాద్కు బాధ్యతలు ఇవ్వాలని నిర్ణయించినట్లు మంత్రి నారాయణ వెల్లడించారు. ఐఐటీ నిపుణులు ఇచ్చే నివేదికల ఆధారంగా నిర్మాణాల విషయంలో ముందుకెళ్తామన్నారు మంత్రి నారాయణ. అమరావతిలో నిర్మాణాల కోసం గతంలో 47 మంది కన్సల్టెంట్స్ను నియమించగా…వారంతా గత ప్రభుత్వంలో తిరిగి వెనక్కి వెళ్ళిపోయారు. మళ్ళీ కన్సల్టెంట్ల నియామకం కోసం టెండర్లు పిలుస్తామని మంత్రి నారాయణ చెప్పారు. సీఆర్డీయేలో గతంలో ఉన్న సిబ్బంది కంటే ప్రస్తుతం 528 మంది తక్కువగా ఉన్నారని, సిబ్బంది కొరత తీర్చేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అమరావతికి సంబంధించి ఎలాంటి నిర్ణయమైనా సీఎం చంద్రబాబు అధ్యక్షతన తీసుకుంటామన్నారు మంత్రి నారాయణ.