ఉమ్మడి విశాఖ జిల్లాలోని ఇన్ఫ్రాస్ట్రక్చర్, ప్రాజెక్టులు, ఎయిర్ పోర్ట్‌పై రివ్యూ చేశారు సీఎం చంద్రబాబు. అధికారంలోకి వచ్చాక మొదటి సారి ఉత్తరాంధ్ర పర్యటనలో పాల్గొన్నారు. తొలి పర్యటనలోనే ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. రైట్ మ్యాన్ రైట్ ప్లేస్‌లో పెట్టాను.. అధికారులను కూడా రైట్ మ్యాన్ రైట్ ప్లేస్‌లో ఉంచాలన్నారు. తనను సంతోష పరిచడం కోసం కాదు.. ప్రజలకు మేలు చేసేలా అధికారులు పనిచేయాలన్నారు. సింపుల్ గవర్నమెంట్.. ఎఫెక్టివ్ గవర్నెన్స్ అనేది తమ ప్రభుత్వ విధానం అని వివరించారు. రెడ్ కార్పెట్లు వద్దని సూచించారు. ప్రభుత్వం ఇకపై పరుగులు పెడుతుంది. అధికారులు కూడా ఆ స్పీడుకు సిద్దం కావాలని చెప్పారు.విశాఖలో పెద్దఎత్తున భూ ఆక్రమణలు జరిగాయని ఆరోపించారు. కొందరు బలవంతంగా భూములు తీసుకున్న వారి నుంచి మళ్లీ స్థలాలు వెనక్కి ఇప్పించాలని ఆదేశించారు. భూ కబ్జాలు చేసేవారిపై కఠినంగా వ్యవహరించండని సూచించారు. రైల్వే జోన్‌కు అవసరమైన ల్యాండ్ ఇవ్వలేదనే వివాదం ఉంది. ఈ ప్రాజెక్టు కోసం కేంద్రానికి ఆమోదయోగ్యమైన స్థలం ఇచ్చి రైల్వే జోన్ పనులు పూర్తిచేయాలని తెలిపారు. భోగాపురం ఎయిర్ పోర్ట్ 2026 నాటికి పూర్తి చేస్తామన్నారు. మరో 500 ఎకరాలు కూడా ఇచ్చి అభివృద్ది చేస్తామని హామీ ఇచ్చారు. గంజాయి, డ్రగ్స్ అనేది ఎక్కడా కనిపించకూడదు. దాని నివారణ కోసం పోలీసులు ఉక్కుపాదం మోపాలని ఆదేశించారు.
సింహాచలం భూముల్లో చాలా మంది ఇళ్లు కట్టుకున్నారు. అన్నీ పరిశీలించి వాళ్లకు అనుమతులు ఇవ్వండి. ఇలాంటి చోట కొంచెం హ్యూమన్ యాంగిల్‌తో నిర్ణయాలు తీసుకోండన్నారు. గత 5 ఏళ్ల పాలనలో ఉత్తరాంధ్రకు తీవ్ర నష్టం జరిగిందని విమర్శించారు. ఉత్తరాంధ్రలో తాగునీటి ప్రాజెక్టులు అన్నీ మూలనపడ్డాయన్నారు. విశాఖలో ట్యాప్ పట్టుకుని తాగేంత స్వచ్ఛమైన శుద్ధి చేసిన నీటి సరఫరా జరగాలని ఆధికారులకు ఆదేశించారు. స్టేట్ హైవేకు కూడా ఎయిర్ పోర్టుతో కనెక్టివిటీ పెంచాలని చెప్పారు. విశాఖ నుంచి భోగాపురం వరకూ వయా భీమిలి మీదుగా బీచ్ కారిడార్ అభివృద్ది చేయాలని అధికారులకు తెలిపారు. రానున్న రోజుల్లో ఇవన్నీ చేపట్టి త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. మెడ్ టెక్ జోన్ నెక్స్ట్ ఫేజ్ కోసం ప్రణాళిక సిద్దం చేయాలన్నారు. బీచ్ రోడ్‌ను మూలపేట వరకు విస్తరించాలని తెలిపారు. విశాఖపట్నంలో మెట్రో ప్రాజెక్టును మళ్లీ పట్టాలు ఎక్కించాలని ఆదేశించారు సీఎం చంద్రబాబు.