బాసర జ్ఞాన సరస్వతి పుణ్యక్షేత్రంలో అక్షరం వర్సెస్ బీజాక్షరం వివాదం తారస్థాయికి చేరింది. బీజాక్షర కార్యక్రమాన్ని కొనసాగిస్తున్న వేద పాఠశాల నిర్వాహకుడితో తాడోపేడో తేల్చుకునేందుకు బాసర ఆలయ కమిటీ రెడీ అయింది. ఆలయ నియమ నిబంధనలకు వ్యతిరేకంగా, అక్షరాభ్యాసాలకు పోటీగా వేద పాఠశాల నిర్వాకుడు విద్యానందగిరి కొనసాగిస్తున్న బీజాక్షరాల కార్యక్రమాన్ని వెంటనే నిలిపివేయాలని వార్నింగ్ ఇచ్చింది బాసర అనుష్టాన పరిషత్. ఇక బీజాక్షర క్రతువు నిలిపివేయాలంటూ విద్యానందగిరికి ఇవాళ మధ్యాహ్నం 12 గంటల వరకు డెడ్‌లైన్ విధించింది. అనుష్టాన పరిషత్ ఇచ్చిన వార్నింగ్‌కి వేద పాఠశాల నిర్వాహకుడు సైతం సై అన్నారు. ఇక ఆలయ నియమాలను ఉల్లంఘిస్తున్న విద్యానందగిరిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఈవో కూడా హెచ్చరించారు. గతంలో వేద పాఠశాల నిర్వహణకు ఇచ్చిన రూ.10 లక్షలు వెనక్కి ఇవ్వాలని ఈవో నోటీసులో పేర్కొన్నారు.
బాసరలో పిల్లల చేత బియ్యంలో కానీ, పలకపై కానీ అక్షరాభ్యాసం చేయిస్తారు. ఇది శతాబ్దాల నుంచి ఆనవాయితీగా వస్తోంది. అయితే విద్యానంద గిరి స్వామి మాత్రం, పిల్లలు నాలుకలపై గరికతో బీజాక్షరాలు రాసి, అక్షరాభ్యాసం చేయిస్తుండడంతో ఈ వివాదం మొదలైంది. తాను నిర్వహిస్తున్న బీజాక్షర కార్యక్రమం అమ్మవారి ఆలయంలో నిర్వహించే అక్షరాభ్యాసాలకు పోటీ కాదన్నారు వేద పాఠశాల నిర్వాహకుడు విద్యానంద గిరి. ఇక బాసరలో నిబంధనలకు విరుద్ధంగా పిల్లల నాలుకలపై బీజాక్షరాలు రాస్తున్న విద్యానంద గిరిపై చర్యలకు సిద్ధమయ్యారు ఆలయ ఈవో విజయ రామారావు. ఈ బీజాక్షర కార్యక్రమాన్ని బాసర ఆలయ క్షేత్ర పరిధిలో నిషేధించామన్నారాయన. మొత్తానికి బాసరలో విద్యానందగిరి వర్సెస్ బాసర ఆలయం అన్నట్టుగా పరిస్థితి మారిపోయింది. ఇవాళ మధ్నాహ్నం 12 గంటల తర్వాత ఏం జరగబోతుందనేది ఉత్కంఠగా మారింది.