ఆషాఢం జాతర మొదలైంది..గోల్కొండ జగదాంబికకు తొలి బోనం

ఆషాఢం జాతర మొదలైంది..గోల్కొండ జగదాంబికకు తొలి బోనం

శివసత్తుల పూనకాలు.. పోతరాజుల విన్యాసాలు.. ఘటాలు, ఫలహార బండ్ల ఊరేగింపులు.. నెత్తిన బోనం పెట్టుకుని తరలివచ్చే మహిళలతో బోనాల పండగ అంగరంగవైభవంగా జరుగుతుంది. తొలి బోనం సమర్పించే గోల్కొండలో బోనాల పండుగ కోలాహలం మొదలైంది. గోల్కొండ కోటలో అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. భక్తులు పెద్దఎత్తున తరలివస్తున్నారు. అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. డప్పు చప్పుళ్లు, తీన్మార్ దరువులతో ఆ ప్రాంతమంతా మార్మోగుతోంది. పోతరాజుల వీరంగాలు, శివసత్తుల ఆటలతో జాతర శోభ సంతరించుకుంది. విశాలా బజార్ లోని గోల్కొండ పోలీస్ స్టేషన్ నుంచి మహంకాళి అమ్మవారి ఊరేగింపు ప్రారంభమయింది. బడా బజార్ అనంతచారి ఇంటి నుంచి జగదాంబిక అమ్మవారి పూజ, ఉత్సవ విగ్రహాల ఊరేగింపును చేపడతారు.

లంగర్ హౌస్ నుంచి ప్రభుత్వం తరఫున సమర్పించే పట్టు వస్త్రాలు.. తొట్టెలు పోతరాజుల ఊరేగింపుతో ప్రారంభమయింది.  బంజారీ దర్వాజా నుంచి గోల్కొండ సర్కారీ బోనంఊరేగింపుగా వస్తుంది. ఇవన్నీ సాయంత్రం 4 గంటల 30 నిమిషాల నుంచి 5 గంటల మధ్య గోల్కొండ కోట గేటు దగ్గరికి చేరకుంటుంది. గోల్కొండ జగదాంబిక అమ్మవారికి తొలి బోనం సమర్పించడంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. మళ్లీ గోల్కొండలోనే చివరి బోనంతో ఉత్సవాలు ముగుస్తాయి. గోల్కొండ బోనాలకు తరలివచ్చే భక్తుల కోసం కోటలో ఏర్పాట్లు చేశారు. కోట ప్రారంభం నుంచి బోనాలు సమర్పించే ప్రాంతం దాకా తాగునీటి పాయింట్లు ఏర్పాటు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేశామని హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి వెల్లడించారు. గోల్కొండ కోట పరిసరాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.. మరోవైపు ఆరోగ్య శాఖ అధికారులు ప్రత్యేకంగా హెల్త్‌ క్యాంప్‌లు ఏర్పాటు చేశారు.

పండుగ జరిగే అన్ని రోజులు భక్తులకు ప్రభుత్వం కోటలోకి ఉచిత ప్రవేశం కల్పించింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖల అధికారులు ఏర్పాట్లు చేశారు. జీహెచ్‌ఎంసీ, పోలీస్‌, హెల్త్‌, ట్రాఫిక్‌, ఎలక్ట్రిసిటీ అధికారులు విధుల్లో పాల్గొంటారు. గోల్కొండ కోటలో మొత్తం 20 మొబైల్ టాయిలెట్లు, ఐదు హెల్త్ క్యాంపులు, మూడు అంబులెన్సులు అందుబాటులో ఉంచారు. వృద్ధులు, వికలాంగులకు బ్యాటరీ వాహనాలు ఏర్పాటు చేశారు.

అత్యవసర పరిస్థితుల్లో అవసరమైయ్యే అంబులెన్స్‌ను కూడా సిద్ధంగా ఉంచారు. అగ్నిమాపక శాఖ వారు మొబైల్‌ ఫైర్‌ ఎస్టింగిషర్‌ను కూడా సిద్ధం చేశారు. పోలీసులు లంగర్‌హౌజ్‌ నుంచి గోల్కొండ వరకు పికెటింగ్‌లు ఏర్పాటు చేయడంతో పాటు మహిళా పోలీస్‌ టీమ్‌లను కూడా సిద్ధంగా ఉంచారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా అన్ని చర్యలు తీసుకున్నామని ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరాజు తెలిపారు

భక్తులకు తాగునీరు

మొత్తం తొమ్మిది పూజలు అందుకునే అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తుల కోసం జలమండలి భారీ ఎత్తున తాగునీటి ఏర్పాట్లు చేస్తోంది.గోల్కొండ బోనాల పండుగకు తాగునీటిని అందించేందుకు హైదరాబాద్ మహానగర నీటి సరఫరా, మురుగునీటి పారుదల మండలి అన్ని ఏర్పాట్లను సిద్ధం చేసింది. హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. కోట మెట్ల నుంచి ప్రారంభమై బోనాలు వరకు వివిధ ప్రాంతాల్లో తాగునీటి పాయింట్లు ఏర్పాటు చేశారు. వంట చేసే ప్రాంతంలో ఇందుకోసం డ్రమ్ములు, సింటెక్స్ ట్యాంకులు, పంపులు, పైపులైన్లు, స్టాండ్‌లు సిద్ధం చేశారు. పైపులైన్ల ద్వారా నీటి సరఫరా చేయనున్నారు. అదనంగా, నీటి ప్యాకెట్లు మరియు గ్లాసులు అందుబాటులో ఉన్నాయి మరియు నీటి క్యాంపుల సమీపంలో టెంట్లు ఏర్పాటు చేయబడ్డాయి. ఆయా ప్రాంతాల్లో నీటి లభ్యత మేరకు నీటి సరఫరా కేంద్రాలను ఏర్పాటు చేశారు. వాటిలో రాందాస్ బధిఖానా, చోటాబజార్, జీహెచ్‌ఎంసీ వార్డు కార్యాలయం, లంగర్‌హౌస్‌లో తాగునీటి సౌకర్యాలు కూడా ఏర్పాటు చేసినట్లు జలమండలి సీనియర్ అధికారి తెలిపారు.

ట్రాఫిక్‌ మళ్లింపు

గోల్కొండ కోట పరిసర ప్రాంతాల్లో నెల రోజుల పాటు ప్రతి ఆది, గురువారాల్లో ట్రాఫిక్ మళ్లింపు ఉంటుంది. కోటకు వచ్చే భక్తులు రామ్ దేవ్ గూడ మక్కాయ్ దర్వాజా నుంచి వచ్చి రామ్ దేవ్ గూడలో పార్కింగ్ చేయాలని అదనపు కమిషనర్ (ట్రాఫిక్) తెలిపారు. లంగర్ హౌజ్ నుంచి గోల్కొండ కోటకు వచ్చే భక్తులు తమ వాహనాలను ఫతే దర్వాజా వద్ద పార్క్ చేయాలి. 7 టూంబ్స్ వైపు నుంచి వచ్చే వాహనాలను బంజారా దర్వాజ వద్ద ఆపాలని షేక్ పెటనాల సూచించారు. కోటలో మొత్తం 650 మంది పోలీసులు బందోబస్తు నిర్వహించనున్నారు. వీరిలో ఇద్దరు లా అండ్ ఆర్డర్ డీసీపీలు, ట్రాఫిక్ డీసీపీలు, ఏడుగురు ఏసీపీలు, 25 మంది సీఐలు, 55 మంది ఎస్సైలు, కానిస్టేబుళ్లు, హోంగార్డులతో పాటు అశ్విక దళం, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిబ్బంది విధుల్లో ఉంటారు.

Please follow and like us:
తెలంగాణ వార్తలు