తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల వ్యవహారంపై ఫిరంగులు పేలుతున్నాయి. ఫిరాయింపుల ఎపిసోడ్‌పై బీఆర్ఎస్- కాంగ్రెస్ మధ్య మాటలయుద్ధం జరిగింది. తమ ఎమ్మెల్యేలను ఎలా చేర్చుకుంటారని బీఆర్ఎస్ సీనియర్ నేత నిరంజన్‌రెడ్డి ప్రశ్నించగా.. గతంలో మీ పార్టీ చేసిందేంటి అని కౌంటర్ ఎటాక్ చేశారు మంత్రి జూపల్లి కృష్ణారావు. తెలంగాణ రాజకీయాల్లో వలసలు జోరుగా కొనసాగుతున్నాయి. ప్రతిపక్ష బీఆర్ఎస్ నుంచి అధికార కాంగ్రెస్‌లోకి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు క్యూ కడుతున్నారు. ఈ క్రమంలోనే.. ఫిరాయింపుల వ్యవహారం తెలంగాణలో హాట్‌టాపిక్‌గా మారుతోంది. ఈ క్రమంలోనే.. అధికార కాంగ్రెస్ తీరుపై బీఆర్ఎస్ విరుచుకుపడుతోంది. కాంగ్రెస్ పార్టీ ఒకవైపు రాజ్యాంగం విలువలు గురించి చెప్తూ.. మరోవైపు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తుందని మండిపడ్డారు మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత నిరంజన్‌రెడ్డి. ఏకంగా సీఎం రేవంత్‌రెడ్డే.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇళ్లకు వెళ్లి.. కాంగ్రెస్ కండువాలు కప్పుతున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా.. ద్వంద్వ విధానాలకు ఎంపీ రాహుల్ గుడ్ బై చెప్పి.. పార్టీ ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించాలని డిమాండ్ చేశారు.
ఇక.. ఫిరాయింపుల విషయంలో బీఆర్ఎస్ కామెంట్స్‌కు కాంగ్రెస్ కౌంటర్ ఇస్తోంది. విలువలు గురించి మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్‌కి లేదన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. గత బీఆర్ఎస్ హయాంలో ఫిరాయింపులను ప్రోత్సహించినప్పుడు నిరంజన్‌రెడ్డి ఎక్కడికి పోయారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నీతులు చెప్తుంటే.. వినే స్థితిలో కాంగ్రెస్ లేదన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. మొత్తంగా.. తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల వ్యవహారం రాజకీయ వర్గాల్లో కాక రేపుతోంది. ఇప్పటివరకు బీఆర్ఎస్ నుంచి ఏడుగురు ఎమ్మెల్యేలు, ఆరుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్‌లో చేరడంతో అనర్హత వేటు వేయాలని స్పీకర్‌కు ఫిర్యాదు చేయడంతోపాటు హైకోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలోనే.. ఫిరాయింపుల విషయంలో రాహుల్ మాటలను గుర్తు చేస్తూ.. టీ.కాంగ్రెస్‌పై విరుచుకుపడుతున్నారు బీఆర్ఎస్ నేతలు. అటు.. బీఆర్ఎస్‌పై కాంగ్రెస్ ఎదురుదాడికి దిగుతుండడంతో పొలిటికల్‌గా హీట్ పెరుగుతోంది.
అదే క్రమంలో బీజేపీ కూడా చేరికలను ప్రోత్సహిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే అనైతికంగా కాకుండా గెలిచిన అభ్యర్థులు రాజీనామా చేసి పార్టీలో చేరాలంటున్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. తెలంగాణలో ఇప్పటికే మంచి ఓటు బ్యాంకు సాధించి జోరు మీద ఉన్న కమలం పార్టీ మంచి నాయకులను తమ పార్టీ వైపు తిప్పుకునేందుకు రాజకీయ వ్యూహాలకు పదునుపెడుతోంది. అందులో భాగంగానే నేరుగా ఎమ్మెల్యేలను, ఎంపీలను చేర్చుకోకుండా రాజీనామా చేసిన తరువాత తమ పార్టీలోకి ఆహ్వానిస్తామని చెబుతోంది. ఈ నేపథ్యంలో ఎవరెవరు ఏ పార్టీలో చేరబోతున్నారన్న దానిపై జోరుగా చర్చ జరుగుతున్న తరుణంలో ఫిరాయింపుల పర్వం జోరుగా నడుస్తోంది.