కొంచెం లేటైయినా.. మహిళలకి ఫ్రీ బస్సు సౌకర్యం కల్పిస్తామన్నారు ఏపీ మంత్రి రాంప్రసాద్‌రెడ్డి. ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు విషయంపై పూర్తి అధ్యయనం చేస్తున్నట్లు మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. దీనిపై పొరుగు రాష్ట్రాల నుంచి సూచనలు తీసుకుని అమలు చేస్తామన్నారు. అలాగే ఆ పథకం అమలులో వచ్చే లోపాలను అధిగమిస్తూ.. వాటిని సరిదిద్ది ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పథకాన్ని కచ్చితంగా అమలు చేస్తామని చెప్పారు. ఆర్టీసీ ప్రక్షాళన సైతం జరుగుతుందని, రాబోయే కాలంలో ఎలక్ట్రికల్ బస్సులు నడిపేందుకు చర్యలు చేపడుతున్నట్లు మంత్రి చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీరుపై మండిపడ్డారు మంత్రి రాంప్రసాద్‌రెడ్డి.
రాయలసీమలో పెద్దిరెడ్డి కుటుంబం పెద్ద మాఫియాగా తయారైందని విమర్శించారు. రాష్ట్రంలో అత్యంత ఎక్కువ ఖనిజ సంపద కొలగొట్టింది పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులే అని ఆయన ఆరోపించారు. రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి తనపై అవాకులు చవాకులు పేలితున్నారంటూ మంత్రి మండిపడ్డారు. ఏపీలో ఏదో అన్యాయం జరిగినట్లు, ఎక్కడో భూకంపం వచ్చినట్టు మిథున్ రెడ్డి మాట్లాడటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ సీఎం జగన్ మోహన్‌రెడ్డికి బినామీగా ఉంటూ మొన్నటి ఎన్నికల్లో డబ్బులు ఖర్చు పెట్టింది ఎవరో అందరికీ తెలుసన్నారు. మిథున్‌రెడ్డి అన్యాయాలపై చట్టపరంగానే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఐదేళ్లు చేసిన పాపమే గడిచిన ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు అన్నారు మంత్రి రాంప్రసాద్‌రెడ్డి. తాము కక్ష సాధింపు చర్యలకు పోమన్నారు.