సింగరేణిపై తెలంగాణలో సిగపట్లు పట్టుకుంటున్నాయి ప్రధాన పార్టీలు. గనుల వేలం మీద.. పొలిటికల్ వార్ ముదిరి పాకాన పడుతోంది. ఈ అంశంలో దశలవారీగా ఆందోళనలకు బీఆర్‌ఎస్ యాక్షన్ ప్లాన్ రెడీ చేయగా… అంతా మీవల్లే అంటూ బీజేపీ, కాంగ్రెస్ ఎదురుదాడి చేస్తున్నాయి.
తెలంగాణలో సింగరేణి చిచ్చు .. పొలిటికల్‌గా అంతకంతకూ అగ్గిరాజేస్తోంది. సింగరేణిలో బొగ్గుగనుల వేలాన్ని వ్యతిరేకిస్తున్న బీఆర్ఎస్.. యాక్షన్ ప్లాన్ రెడీ చేసింది. ఈ క్రమంలోనే.. సింగరేణి పరిధిలోని మాజీ ఎమ్మెల్యేలు, బొగ్గు గని కార్మిక సంఘం నేతలతో సమావేశమైన కేటీఆర్.. మరోసారి ఉద్యమించి సింగరేణిని కాపాడుకుంటామని చెప్పారు. సింగరేణిని ప్రైవేటీకరించేందుకే కేంద్రం తెలంగాణ బొగ్గు గనులను వేలం వేసిందని కేటీఆర్ పేర్కొన్నారు. కేంద్రంతో రాష్ట్ర ముఖ్యమంత్రి కుమ్మక్కు అయి వాళ్లకు బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్నారు. లాభసాటిగా ఉన్న సింగరేణికి బొగ్గు గనులు కేటాయించకుండా నష్టాల్లోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారని… దీనిని అడ్డుకోవాలంటూ పిలుపునిచ్చారు..
కేటీఆర్‌తో భేటీ అనంతరం.. ఉద్యమ కార్యాచరణ ప్రకటించింది బొగ్గుగని కార్మిక సంఘం. జూలై 1 నుంచి 9న వరకు నిరసనలు.. భారీధర్నా చేపట్టాలని నిర్ణయించింది. రెండవ దశలో కోల్ బెల్ట్ ఎమ్మెల్యేలకు వినతిపత్రాలు ఇవ్వాలని, ఇందిరాపార్క్ దగ్గర ధర్నా చేపట్టాలని నిర్ణయించింది. పార్లమెంట్ సమావేశాల వేళ డిల్లీ జంతర్ మంతర్ దగ్గర ధర్నా కూడా చేయాలని ప్లాన్ చేస్తోంది.
బొగ్గుగని కార్మిక సంఘం యాక్షన్ ప్లాన్ ఇదే..
జూలై 1న నల్ల బ్యాడ్జీలతో నిరసన
జూలై 3న కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల దిష్టిబొమ్మల దహనం
జూలై 6న జి.ఎం.ఆఫీసుల మందు ధర్నా
జూలై 9న గోదావరిఖనిలో భారీధర్నా
రెండవ దశలో కోల్ బెల్ట్ ఎమ్మెల్యేలకు వినతిపత్రాలు
ఇందిరాపార్క్ దగ్గర ధర్నా చేపట్టాలని నిర్ణయం
పార్లమెంట్ సమావేశాల వేళ ఢిల్లీ జంతర్‌మంతర్ దగ్గర ఆందోళన
సింగరేణి గురించి బీఆర్‌ఎస్ మాట్లాడటం దయ్యాలు వేదాలు వల్లించడమే అంటోంది బీజేపీ. సింగరేణి లో ఓపెన్ కాస్ట్ లను ప్రైవేట్ వాళ్ళకి కట్టబెట్టిందే కేసీఆర్ అని ఆరోపించారు కమలం నేతలు.
మరోవైపు, బీఆర్‌ఎస్, బీజేపీలు కలిసి పదేళ్లలో.. సింగరేణిని ధ్వంసం చేశాయని ఆరోపిస్తున్నారు హస్తం నేతలు. మరి, సింగరేణిపై ఈ చిచ్చు మున్ముందు ఎటు దారితీస్తుందో వేచి చూడాల్సిందే..