మాజీ సీఎం కొణిజేటి రోశయ్య కన్నుమూత

మాజీ సీఎం కొణిజేటి రోశయ్య కన్నుమూత

Top Story

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 15వ ముఖ్యమంత్రిగా పనిచేసిన కొణిజేటి రోశయ్య (88) అనారోగ్యంతో శనివారం ఉదయం కన్నుమూశారు. ఒక్కసారిగా ఆయనకు బీపీ డౌన్ కావడంతో కుటుంబీకులు బంజారాహిల్స్‌లోని స్టార్ ఆస్పత్రికి తరలించే లోపే మార్గం మధ్యలో రోశయ్య చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రోశయ్య గతంలో తమిళనాడు గవర్నర్‌గా పని చేశారు. అయితే కొన్నాళ్లుగా రాజకీయాలకు ఆయన దూరంగా ఉంటున్నారు. వైఎస్ఆర్ మరణం తర్వాత సెప్టెంబర్ 3, 2009 నుంచి జూన్ 25, 2011 వరకు రోశయ్య ముఖ్యమంత్రిగా పనిచేశారు.

1933 జూలై 4న గుంటూరు జిల్లా వేమూరులో ఆదెమ్మ, సుబ్బయ్య దంపతులకు జన్మించిన రోశయ్య… గుంటూరు హిందూ కాలేజీలో వాణిజ్య శాస్త్రంలో డిగ్రీ పూర్తి చేశారు. ఆయన కాంగ్రెస్ పార్టీ తరఫున 1968, 1974, 1980లలో శాసనమండలి సభ్యుడిగా ఎన్నికయ్యారు. తొలిసారిగా మర్రిచెన్నారెడ్డి ప్రభుత్వంలో రోడ్లు, రహదారుల శాఖ, రవాణాశాఖ మంత్రిగా పనిచేశారు. 1991లో నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి ప్రభుత్వంలో ఆర్థిక, ఆరోగ్య, విద్య, విద్యుత్ శాఖల మంత్రిగా పనిచేశారు. 1992లో కోట్ల విజయ్‌భాస్కర్‌రెడ్డి ప్రభుత్వంలో ఆర్థిక, ఆరోగ్య, విద్య, విద్యుత్ శాఖలకు మంత్రిగా పనిచేసారు. 2004, 2009లో వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వంలో ఆర్థికశాఖ మంత్రిగా రోశయ్య బాధ్యతలు నిర్వర్తించారు.

Loading...

కాగా మాజీ సీఎం రోశయ్య మృతి పట్ల రాజ‌కీయ ప్ర‌ముఖులు, అభిమానులు సంతాపం తెలుపుతున్నారు. ఆదివారం రోశయ్య అంత్యక్రియ‌లు జ‌రిగే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది.

Loading...

Leave a Reply

Your email address will not be published.