‘సిరివెన్నెల’ను చూసి మురిసిన ‘నంది’వర్ధనాలు!

‘సిరివెన్నెల’ను చూసి మురిసిన ‘నంది’వర్ధనాలు!

Top Story సినిమా వార్తలు

ఏ గీత రచయితకైనా రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఒక్కసారైనా ఉత్తమ గీత రచయితగా నిలవాలన్న అభిలాష ఉంటుంది. తెలుగు చిత్రసీమలోనూ అలాంటి కోరికతో ఎంతోమంది గీతరచయితలు సాగుతున్నారు. కొందరిని అవార్డులు వరించాయి. కొందరి పాటలు మురిపించినా, జనం రివార్డులతోనే సరిపుచ్చుకోవలసి వచ్చింది. తెలుగు సినిమా రంగంలో పదకొండు సార్లు రాష్ట్రప్రభుత్వ నంది అవార్డులను అందుకున్న ఏకైక గీత రచయితగా సిరివెన్నెల సీతారామశాస్త్రి చరిత్ర సృష్టించారు. ఆ మాటకొస్తే నంది అవార్డుల్లో ‘హ్యాట్రిక్’ సాధించిన ఏకైక పాటల రచయిత కూడా ఇప్పటికి సీతారామశాస్త్రియే కావడం విశేషం!

తొలి ‘హ్యాట్రిక్’!


కె.విశ్వనాథ్ ‘జననీజన్మభూమి’లో సిహెచ్. సీతారామశాస్త్రి బ్రాకెట్ లో ‘భరణి’ అన్న పేరుతో పరిచయమయ్యారు. అంతకు ముందు ‘భరణి’ పేరుతో సీతారామశాస్త్రి కవితలు రాసేవారు. అందువల్ల ఆ పేరునూ బ్రాకెట్ లో వేసుకున్నారు. ఇక కె.విశ్వనాథ్ ‘సిరివెన్నెల’లో సీతారామశాస్త్రి అన్ని పాటలూ పలికించారు. దాంతో ‘సిరివెన్నెల’ ఆయన ఇంటిపేరుగా మారింది. ఈ సినిమాలోని “విధాత తలపున ప్రభవించినది…” పాటతో సీతారామశాస్త్రికి ఉత్తమ గీత రచయితగా 1986లో తొలి నంది అవార్డు లభించింది. 1987లో కె.విశ్వనాథ్ దర్శకత్వంలో వెలుగు చూసిన ‘శ్రుతిలయలు’ చిత్రంలోని “తెలవారదేమో స్వామీ…” పాటతో సీతారామశాస్త్రికి రెండవ నంది దక్కింది. మళ్ళీ కె.విశ్వనాథ్ తెరకెక్కించిన ‘స్వర్ణకమలం’లో “అందెల రవళిది పదములదా…” పాటతో 1988లో ఉత్తమ గీతరచయితగా మరో నందిని అందుకున్నారు సీతారామశాస్త్రి. ఇలా ఆరంభంలోనే ‘హ్యాట్రిక్’ చూశారు సిరివెన్నెల. అలా నంది అవార్డుల్లో ఉత్తమ గీతరచయిత విభాగంలో తొలి ‘హ్యాట్రిక్’ నమోదు చేసిన ఘనత సీతారామశాస్త్రికి దక్కింది. ఈ మూడు చిత్రాలకు కళాతపస్వి కె.విశ్వనాథ్ దర్శకత్వం వహించడం విశేషం!

Loading...

తరువాతి రోజుల్లోనూ సీతారామశాస్త్రిని మరో ఎనిమిది నంది అవార్డులు వరించాయి. 1993లో రామ్ గోపాల్ వర్మ ‘గాయం’ కోసం సీతారామశాస్త్రి రాసిన “సురాజ్యమవలేని స్వరాజ్యమెందుకని…” గీతం నాలుగో నందిని సిరివెన్నెల ఇంట నిలిపింది. మరుసటి సంవత్సరమే, అంటే 1994లో ఎస్వీ కృష్ణారెడ్డి ‘శుభలగ్నం’లో “చిలకా ఏ తోడు లేక…” పాటతో ఐదో నంది సీతారాముని ఇంటికి వెళ్ళింది. 1996లో సి.ఉమామహేశ్వరరావు ‘శ్రీకారం’లో “మనసు కాస్త…” పాటతో ఆరో నంది సీతారాముని వెంట నడచివెళ్ళింది. ఇక 1997లోనూ ఏడో నంది సిరివెన్నెలను వెదుక్కుంటూ పోయింది. ఈ సారి కృష్ణవంశీ ‘సిందూరం’లో “అర్ధశతాబ్దపు అజ్ఞానాన్ని స్వరాజ్యమందామా…” పాటతో నంది దక్కింది. 1999లో రామ్ గోపాల్ వర్మ ‘ప్రేమకథ’లో “దేవుడు కరుణిస్తాడని…” పాట సిరివెన్నెలకు ఎనిమిదో నందిని సంపాదించి పెట్టింది. “జగమంత కుటుంబం నాది…” అంటూ కృష్ణవంశీ ‘చక్రం’లో సీతారాముడు పలికించిన పాటతో 2005 సంవత్సరం ఉత్తమ గీతరచయిత నంది అవార్డు తొమ్మిదవ సారి ఆయన ఇంట నిలచింది.

క్రిష్ తొలి చిత్రం ‘గమ్యం’లో “ఎంతవరకు ఎందుకొరకు…” అంటూ పలికించిన పాటతో 2008 నంది అవార్డు సీతారామశాస్త్రి సొంతమయింది. ఇది సీతారామునికి దక్కిన పదవ నంది. 2013లో శ్రీకాంత్ అడ్డాల చిత్రం ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు’లో సిరివెన్నెల పలికించిన “మరీ అంతగా మహా చింతగా మొహం ముడుచుకోకలా…” పాట పదకొండవ నందిని అందించింది.

పేరులో రాముడున్నా, సీతారామశాస్త్రి శివభక్తులు. శివుడు ఏకాదశ ప్రియుడు. ఇక నంది ఆయన వాహనం. అందువల్ల సీతారామశాస్త్రిని వెదుక్కుంటూ పదకొండు సార్లు నంది ఆయన ఇంటికి వెళ్ళిందేమో అనిపిస్తుంది. సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి గారు చివ‌ర‌గా నాని హీరోగా న‌టించిన ‘శ్యామ్ సింగ‌రాయ్’ సినిమాలో రెండు పాట‌లు రాయ‌డం జ‌రిగింది. అవే అత‌ని చివ‌రి పాట‌లు కావ‌డం విషాద‌క‌రం.

Loading...

Leave a Reply

Your email address will not be published.